Telangana: కేసులు పెరుగుతున్నాయి, ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి, అధికారులు లాక్డౌన్ అమలు విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం చూపరాదు, నిఘా- పర్యవేక్షణ మరింత పెంచాలి: తెలంగాణ సీఎం కేసీఆర్

మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారిని గుర్తించి, పరీక్షలు చేసే పని ముమ్మరంగా జరుగుతున్నది. ఇంకా ఎవరైనా తెలిసో తెలియకో పరీక్షలు చేయించుకోకుంటే వారే స్వయంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. ఇది వారి కోసం, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం చెబుతున్న మాటలు......

Telangana: కేసులు పెరుగుతున్నాయి, ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి, అధికారులు లాక్డౌన్ అమలు విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం చూపరాదు, నిఘా- పర్యవేక్షణ మరింత పెంచాలి: తెలంగాణ సీఎం కేసీఆర్
CM KCR & Health Minister Etala Rajender | File Photo

Hyderabad, April 13:  ఒకవైపు లాక్డౌన్ కొనసాగుతున్నా, దేశంలో ఎక్కడా కూడా కరోనావైరస్ వ్యాప్తి (COVID-19 Outbreak) తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలో కూడా ఆదివారం కొత్తగా 28 మందికి కరోనా వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. అంతేకాకుండా కోవిడ్-19 బారిన పడిన మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.  దీంతో రాష్ట్రంలో (Telangana) కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 531కి చేరగా, మరణించిన వారి సంఖ్య 16కు పెరిగింది.

కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనావైరస్ సోకిన వారిలో 103 మంది చికిత్స తర్వాత కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీని ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో 412 యాక్టివ్ కేసులున్నాయి. వీరంతా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కోవిడ్-19 కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో తెలంగాణ ముఖ్యమంత్రి మరింత అప్రమత్తమయ్యారు. లాక్డౌన్ అమలు విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం తగదని సూచించారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా, తెలంగాణలో పరిణామాలు గమనిస్తుంటే కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదని స్పష్టం అవుతున్నది. ఆదివారం కూడా గణనీయ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా 28కి పాజిటివ్ అని తేలడంతో పాటు ఇద్దరు చనిపోయారు. పక్కనే ఉన్న మహారాష్ట్రంలో పరిస్థితి భయంకరంగా ఉంది. దేశ వ్యాప్తంగా కూడా పాజిటివ్ కేసులు పెరిగాయి, మరణాలు పెరిగాయి. ఈ పరిస్థితి ఉన్నందునే లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నాం. పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాలి. వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలి. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పక సామాజిక దూరం పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. ఎవరికి ఏమాత్రం అనుమానం వచ్చినా పరీక్షలు చేయించుకోవాలి. కరోనా వైరస్ సోకిన వ్యక్తులున్న ప్రాంతాలను గుర్తించి, ప్రభుత్వం అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ప్రజలు దానికి సహకరించాలి. కరోనా వ్యాప్తి నివారణ అన్నది కేవలం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. ఆ నిర్ణయాలను ప్రజలు తు.చ. తప్పకుండా పాటించడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతున్నదనే వాస్తవం గ్రహించి, ప్రజలు ఇంతకుముందు కంటే కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి లక్షణాలు కనిపించినా పరీక్షలు నిర్వహించాలి.  పాజిటివ్ వచ్చిన వారు ఎవరెవరిని కలిశారు? ఎక్కడ తిరిగారు? అనే వివరాలు సేకరించి, వారికీ పరీక్షలు నిర్వహించాలి. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీలు ఎక్కువ చేయాలి. నియంత్రణ పెంచాలి.  మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారిని గుర్తించి, పరీక్షలు చేసే పని ముమ్మరంగా జరుగుతున్నది. ఇంకా ఎవరైనా తెలిసో తెలియకో పరీక్షలు చేయించుకోకుంటే వారే స్వయంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. ఇది వారి కోసం, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం చెబుతున్న మాటలు. ప్రజల నిరంతర అప్రమత్తత, ఇళ్లకే పరిమితం కావడంపైనే కరోనా వ్యాప్తి నివారణ సాధ్యం అవుతుంది’’ అని సీఎం తెలిపారు.  తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

కరోనా వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలు, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్ డౌన్ అమలవుతున్న తీరు, పేదలకు అందుతున్నసాయం, పంటల కొనుగోళ్లు జరుగుతున్న విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 9.30 వరకు సాగిన ఈ సమీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని సీఎం సమీక్షించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, జనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

(The above story first appeared on LatestLY on Apr 13, 2020 09:00 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).