Corona in Telangana: మహమ్మారి ఎంతకాలం ఉంటుందో తెలియదు.. కరోనాతో కలిసే సాధారణ జీవితం సాగేలా పక్కా వ్యూహం రూపొందించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

కరోనాతో పోరాడుకుంటూనే ఇతరత్రా కూడా సిద్ధం కావాల్సి ఉంది. ఆర్థిక కార్యకలాపాలు సాగాలి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులు అమలవుతున్నాయి. కొన్ని పనులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో భవిష్యత్తులో సడలింపులను ఎలా అమలు చేయాలి....

Corona in Telangana: మహమ్మారి ఎంతకాలం ఉంటుందో తెలియదు.. కరోనాతో కలిసే సాధారణ జీవితం సాగేలా పక్కా వ్యూహం రూపొందించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
Telangana CM KCR | File Photo.

Hyderabad, May 11: కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటూనే, కరోనాతో కలిసి జీవించే వ్యూహం రూపొందించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కరోనా ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని, కాబట్టి కరోనా ప్రభావం ఉన్నప్పటికీ జీవితం ఎలా సాగాలనే విషయంలో ఖచ్చితమైన వ్యూహం, ప్రణాళిక అవసరమని సీఎం అన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం  ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

‘‘కరోనా వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. వైరస్ వచ్చిన వారికి ఇప్పటి మాదిరిగానే అత్యుత్తమ సేవలు అందాలి. కాంటాక్ట్ వ్యక్తుల పరీక్షలు జరగాలి. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా ఖచ్చితమైన క్యారంటైన్ నిబంధనలు పాటించాలి. ఇప్పటికే అన్ని రకాల పరికరాలు, మందులు, సదుపాయాలతో సిద్ధంగా ఉన్నాం. వైద్య పరంగా అత్యుత్తమంగా స్పందిస్తాం. అందులో సందేహం లేదు’’ అని సీఎం అన్నారు.

‘‘కరోనాతో పోరాడుకుంటూనే ఇతరత్రా కూడా సిద్ధం కావాల్సి ఉంది. ఆర్థిక కార్యకలాపాలు సాగాలి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులు అమలవుతున్నాయి. కొన్ని పనులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో భవిష్యత్తులో సడలింపులను ఎలా అమలు చేయాలి? ఏ జోన్ లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి? దేన్ని అనుమతించాలి? దేన్ని అనుమతించకూడదు? హైదరాబాద్ విషయంలో ఏ చర్యలు తీసుకోవాలి? ఇతర జిల్లాల్లో ఎలా వ్యవహరించాలి? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. ఏయే రంగానికి ఏ సడలింపులు ఇవ్వాలి? ఏ విషయాల్లో కఠినంగా వ్యవహరించాలి?’’ తదితర అంశాల్లో అధికారులు లోతుగా ఆలోచించి, ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధికారులను కోరారు.

** అంతకుముందు ప్రధానితో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న సీఎం కేసీఆర్, దేశంలో ఇప్పుడప్పుడే కరోనావైరస్ వ్యాప్తి తగ్గే సూచనలు లేనందున లాక్డౌన్ మరికొన్ని రోజులు పొడగించాలని కేంద్రాన్ని కోరారు. దేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందున ఇప్పుడే ప్యాసెంజర్ రైళ్లను ప్రారంభించవద్దని కేసీఆర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

నివేదికల ప్రకారం, తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్డౌన్ పెంచాలని కేంద్రాన్ని కోరగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లాక్డౌన్ ఆంక్షల నుంచి మరిన్ని సడలింపులు ఇవ్వాల్సిందిగా కోరినట్లు తెలిసింది.

(The above story first appeared on LatestLY on May 11, 2020 11:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).