SC on OBC Reservation: బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి సర్కారుకు ఊరట, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున జోక్యం చేసుకోలేమని స్పష్టం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీఓ నంబర్ 9పై దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది.
Hyd, Oct 6: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీఓ నంబర్ 9పై దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. ఈ కేసు ఇప్పటికే హైకోర్టులో విచారణలో ఉందని, తాము ఈ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. విచారణలో ధర్మాసనం.. హైకోర్టు ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరుపుతున్నప్పుడు, ఇక్కడికి ఎందుకు వచ్చారు?” అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి న్యాయవాది సమాధానమిస్తూ, “హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది” అని తెలిపారు. ఈ నేపథ్యంలో బెంచ్ వ్యాఖ్యానిస్తూ, “అక్కడ స్టే ఇవ్వలేదు కాబట్టి ఇక్కడికి వస్తారా?” అని ప్రశ్నించింది. చివరికి సుప్రీంకోర్టు హైకోర్టు విచారణ కొనసాగుతోందని పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించింది.
పిటిషన్ దాఖలు చేసిన వంగా గోపాల్ రెడ్డి తన వాదనలో, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ సుప్రీంకోర్టు గత తీర్పులకు విరుద్ధమని పేర్కొన్నారు. స్థానిక సంస్థలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు ఇంతకుముందే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని ఆయన వాదించారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంతో మొత్తం రిజర్వేషన్ శాతం 67 శాతానికి చేరిందని ఇది చట్టవిరుద్ధమని అన్నారు. జీఓ నంబర్ 9ను తక్షణమే రద్దు చేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు.
ఈ కేసులో మాధవరెడ్డి, తీన్మార్ మల్లన్న కూడా ఇంప్లీడ్ పిటిషనర్లుగా ఉన్నారు. అయితే, సుప్రీంకోర్టు ఈ దశలో ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండా కేసును ముగించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట కలిగించింది.
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 26న ఈ జీఓను జారీ చేసింది. రాష్ట్రంలో బీసీ సమాజానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ శాతాన్ని 42 శాతానికి పెంచింది. ఈ నిర్ణయం ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్ 9 నుండి నవంబర్ 11 వరకు ఐదు దశల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఇక ఇదే జీఓపై దాఖలైన మరో పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. హైకోర్టు తీర్పు వచ్చే వరకు రిజర్వేషన్ల అమలుపై రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట లభించిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
(The above story first appeared on LatestLY on Oct 06, 2025 03:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

