Polling (Credits: X)

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల (Local Body) ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది. మొదట ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముది ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఎన్నికలు మొత్తం ఐదు విడతల్లో నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘం కమిషనర్‌(Telangana Elections) సోమవారం ఉదయం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలతో అధికారులు చర్చించారని తెలిపారు. ఎన్నికల కోసం 15,302 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

టీజీఎస్ఆర్టీసీ ఎండీగా చివరి రోజు బస్సులో ప్రయాణించిన సజ్జనార్, బస్సు దిగి కొత్త మార్గంలో వెళ్లవలసి ఉందంటూ భావోద్వేగం, హైదరాబాద్ సీపీగా తదుపరి బాధ్యతలు

మొత్తం 31 గ్రామీణ జిల్లా, 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో జడ్పీటీసీ (ZPTC) స్థానాలు 565, ఎంపీటీసీ (MPTC) స్థానాలు 5,749 ఉన్నాయి. ఎంపీటీసీ ఎన్నికలకు 31,300 పోలింగ్ కేంద్రాలు, జడ్పీటీసీ ఎన్నికలకు 15,302 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. మొత్తం గ్రామపంచాయతీలు 12,733, వార్డుల సంఖ్య 1,12,288 గా ఉంది. గ్రామపంచాయతీల కోసం ప్రత్యేకంగా 15,522 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొత్తం రాష్ట్రంలో 1,12,474 పోలింగ్ స్టేషన్లు పని చేయనున్నాయి. తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య కోటి 67 లక్షల 3,168కి చేరింది. వీటిలో పురుష ఓటర్లు 81,65,894, మహిళా ఓటర్లు 85,36,770గా ఉన్నారు.

విడతల వారీ షెడ్యూల్ ఇదే:

1. మొదటి విడత (MPTC & ZPTC): నామినేషన్లు అక్టోబర్ 9 నుంచి ప్రారంభం, పోలింగ్ అక్టోబర్ 23.

2. రెండో విడత (MPTC & ZPTC): పోలింగ్ అక్టోబర్ 27.

3. సర్పంచ్‌ మొదటి విడత: నోటిఫికేషన్ అక్టోబర్ 17, పోలింగ్ అక్టోబర్ 31.

4. రెండో విడత సర్పంచ్‌: నామినేషన్లు అక్టోబర్ 21 నుంచి, పోలింగ్ నవంబర్ 4.

5. మూడో విడత సర్పంచ్‌: నామినేషన్లు అక్టోబర్ 25 నుంచి, పోలింగ్ నవంబర్ 8.

రిజర్వేషన్ల వివరాల కోసం ఆదివారం సాయంత్రం గెజిట్ విడుదల చేశారు. తక్షణమే ఎన్నికల కోడ్‌ అమలులోకి రానున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముది తెలిపారు. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు 14 ఎంపీటీసీలు, 27 జీపీలు, 246 వార్డులకు ఎన్నికలను ఎన్నికల సంఘం నిలిపివేసింది. ములుగులో 25 జీపీలు, కరీంనగర్‌లోని రెండు జీపీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు.