Hyd, Dec 20: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని హరీశ్‌రావు అన్నారు. ఈ శ్వేతపత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యయం- తెలంగాణ వాటా కింద 1956-57 నుంచి 2013-14 వరకు 41.68 శాతం ఖర్చు చేసినట్లు గంపగుత్త లెక్క తీశారని తెలిపారు. ఈ లెక్కలు శుద్ద తప్పు అని.. కావాలంటే దీనిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.
మొత్తం లెక్కలు తీసి.. నిజానికి ఎంత ఖర్చయ్యిందో చూపించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం.. తెలంగాణ అధికారులపై నమ్మకం లేక.. రిటైర్డ్ అధికారి.. సస్పెండ్ అయిన ఏపీ అధికారులతో ఈ శ్వేత పత్రం ప్రిపేర్ చేయించారని అన్నారు. ఆ వివరాలు, వాస్తవాలను అవసరం వచ్చినప్పుడు బయట పెడతామని తెలిపారు.
ఈ మొత్తం రిపోర్టు చూస్తే.. ఏ అంశాల్లో గత ప్రభుత్వాన్ని తప్పు పట్టొచ్చో.. ఏ అంశాల్లో మెరుగ్గా ఉన్నామో చూపించాలో.. తమకు కన్వినెంట్‌గా ఉన్న దాన్ని బట్టి రెడీ చేయించినట్లు కనబడుతుందని హరీశ్‌రావు అన్నారు. గత పదేండ్లలో చాలా రంగాల్లో ప్రగతి సాధించిందని. అనేక విషయాల్లో మెరుగ్గా ఉన్నామని తెలిపారు. కానీ వాటిని ఈ రిపోర్టులో చూపించకుండా.. తమకు కన్వినెంట్‌గా తయారు చేయించారని విమర్శించారు.
‘సాధారణంగా అప్పులను డెడ్ టు జీఎస్‌డీపీ రేషియో చూస్తాం.. కానీ ఈ టేబుల్‌ను ఇందులో పెట్టకుండా డెడ్ టు రెవెన్యూ రిసిప్ట్‌ను చూపించారు. జాతీయంగా అయినా.. అంతర్జాతీయంగా అయినా అప్పులను డెడ్ టు జీఎస్‌డీపీ రేషియోలో కొలుస్తారు. కానీ ఇందులో ఆ టేబుల్‌ను ఎక్కడా చూపించలేదు. అది కూడా ఒక కరోనా సంవత్సరాన్ని తీసుకుని.. దాని ప్రకారం చూపించే ప్రయత్నం చేశారు.
వాస్తవానికి రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం.. డెడ్ టు జీఎస్‌డీపీ రెషియో చూస్తే అప్పులు తక్కువ తీసుకున్న రాష్ట్రాల్లో కింద నుంచి ఐదో స్థానంలో ఉన్నాం. అంటే మనకంటే 22 స్థానాలు తెలంగాణ కంటే ఎక్కువగా తీసుకున్నాయి. మనకంటే ఎక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మొన్నటిదాకా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో 2022-23 నాటికి 537013 కోట్ల అప్పు.. కర్ణాటక కూడా 535157 కోట్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ చూయించకుండా.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.’ అని హరీశ్‌రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిదేండ్లలో 3,36,916 కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్సపెండిచర్ జరిగిందని.. కానీ దీన్ని ఆ రిపోర్టులో చూపించే ప్రయత్నం చేయరని హరీశ్‌రావు అన్నారు. ఇవాళ ఎంత క్యాపిటల్ ఎక్సపెండిచర్ జరిగింది? ఈ డబ్బంతా ఎటు పోయింది? అంటే రేపటి రాష్ట్ర అవసరాల కోసం.. రేపటి భవిష్యత్తు తరాల కోసం ఆస్తుల కల్పన చేసే ప్రయత్నం చేశామని వివరించారు. కానీ ఇంత పెద్ద ఎత్తున క్యాపిటల్ ఎక్స్‌పెండేచర్ జరిగిందని ఆ నివేదికలో చూపించలేదన్నారు.
పక్షపాత నివేదికను చూపించే ప్రయత్నం చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల అభివృద్ధిలో దేశానికే తలమానికంగా తెలంగాణను నిలిపామని హరీశ్ రావు తెలిపారు. కానీ దాన్ని ఇందులో చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన ఆదాయం ఎట్ల పెరిగింది? ఆస్తుల కల్పన ఎట్ల పెరిగింది? క్యాపిటల్ ఎక్సపెండిచర్ ఎలా చేశాం? అనేవి చూపించకుండా.. తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందన్నారు. మెడికల్ అండ్ హెల్త్ విషయంలో 2014-15లో రాష్ట్ర బడ్జెట్‌లో 2,432 కోట్లు ఉంటే.. ఈ ఏడాది బడ్జెట్‌లో 12,161 కోట్లు కేటాయించామని తెలిపారు. అంటే వైద్య, ఆరోగ్య రంగంలో బడ్జెట్ దాదాపు 6 రెట్లు పెంచి అద్భుతమైన ప్రగతి సాధించామని తెలిపారు.