Telangana: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. చంచలగూడ జైలుకు ముత్యం వెంకట రమణ.. కూడబెట్టిన ఆస్తులు రూ. 150 కోట్ల పైమాటే..
Telangana: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీజీరెడ్కో) డివిజనల్ ఇంజనీర్ ముత్యం వెంకట రమణకు నగర న్యాయస్థానం గురువారం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీజీరెడ్కో) డివిజనల్ ఇంజనీర్ ముత్యం వెంకట రమణకు నగర న్యాయస్థానం గురువారం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం సాయంత్రం అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) అధికారుల చేతిలో అరెస్టయిన వెంకట రమణను.. ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రధాన ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరచగా.. కోర్టు అతడిని రెండు వారాల కస్టడీకి ఆదేశించింది. అనంతరం ఆయనను చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.
వెంకట రమణ నివాసం, కార్యాలయంతో పాటు ఆయన బంధువులు, సహచరులు, బినామీల ఆధీనంలో ఉన్న మొత్తం ఏడు ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించి ఈ భారీ అక్రమాస్తులను వెలికితీశాయి. ఈ సోదాల్లో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి పరిధిలో రూ. 1.23 కోట్ల విలువైన నాలుగు నివాస ఫ్లాట్లు, కూకట్‌పల్లి ఆంజనేయ నగర్‌లో రూ. 1.82 కోట్ల విలువైన ఒక జి-3 వాణిజ్య భవనం, గుట్టల బేగంపేట్‌లో రూ. 2.90 కోట్ల విలువైన ఒక జి-5 వాణిజ్య భవనాన్ని అధికారులు గుర్తించారు.
ఇవే కాకుండా రూ. 52.02 లక్షల బ్యాంకు డిపాజిట్లు, రూ. 40 లక్షల విలువైన 2,094 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 45 లక్షల విలువైన మూడు వాహనాలు, రూ. 30 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల ప్రభుత్వ డాక్యుమెంట్ విలువ రూ. 27.65 కోట్లుగా ఉంటే.. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ మరింత ఎక్కువగా ఉంటుందని ఏసీబీ స్పష్టం చేసింది.
మరింత లోతుగా సాగిన విచారణలో.. వెంకట రమణ తన భార్య పేరు మీద నమోదైన నాలుగు నిర్మాణ సంస్థల ద్వారా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఈ సంస్థల ద్వారా మూసాపేట ఆంజనేయ నగర్‌లో రూ. 20 కోట్ల వ్యయంతో 10 నివాస అపార్ట్‌మెంట్లను నిర్మించినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. అంతేకాకుండా.. సోదాల సమయంలో రూ. 2.5 లక్షల విలువైన 19 విదేశీ మద్యం సీసాలు, ఒక ఐఎంఎఫ్ఎల్ సీసా లభించడంతో మాదాపూర్ ఎక్సైజ్ పోలీసులు ఆయనపై ప్రత్యేకంగా మరొక కేసు నమోదు చేశారు.
కాగా సదరు అధికారి ఏసీబీకి చిక్కడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2019 డిసెంబర్‌లో సైబర్ సిటీ సర్కిల్‌లో డివిజనల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కాలంలో రూ. 25 వేలు లంచం తీసుకుంటూ ట్రాప్‌లో దొరికిపోయారు. అప్పట్లో జరిపిన సోదాల్లో రూ. 26.52 లక్షల నగదు, రూ. 22.60 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. గతంలో చిక్కిన ఆస్తులతో పాటు ప్రస్తుత సోదాల్లో బయటపడినవాటిని కలిపితే ఈ అధికారి అక్రమ ఆస్తుల మొత్తం విలువ ఏకంగా రూ. 28.14 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ విశ్లేషించింది.
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

