తెలంగాణ పోలీసు శాఖ తమ సిబ్బంది మతపరమైన దీక్షల్లో పాల్గొనే విషయంలో కొత్తగా కఠిన ఆదేశాలు జారీ చేసింది. అయ్యప్ప దీక్ష వంటి ఆచారాల్లో ఉన్న అధికారులు, సిబ్బంది డ్యూటీకి హాజరుకావద్దని, తప్పనిసరిగా ముందస్తు సెలవు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించి విధుల్లో ఉండగా దీక్షా వస్త్రాలతో కనిపించిన సౌత్ ఈస్ట్ జోన్‌కు చెందిన కంచన్‌బాగ్ ఎస్సై కృష్ణకాంత్‌కు ఉన్నతాధికారులు మెమో జారీ చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం రాష్ట్రంలో అయ్యప్ప దీక్షల సీజన్ నడుస్తుండటంతో, కానిస్టేబుళ్ల నుంచి ఉన్నతాధికారుల వరకు పలువురు మాల ధరించారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ పోలీస్ శాఖ విడుదల చేసిన తాజా మార్గదర్శకాలు పోలీసు వర్గాల్లో చర్చకు దారితీశాయి. విధుల్లో ఉన్నప్పుడు యూనిఫామ్ బదులు నల్ల దుస్తులు, నల్ల కండువాలు ధరించడం, పాదరక్షలు లేకుండా డ్యూటీలో తిరగడం పూర్తిగా నిషేధించినట్లు హెడ్‌ఆఫీస్ స్పష్టం చేసింది. అలాగే డ్యూటీ సమయంలో జుట్టు, గడ్డం పెంచుకోవడం కూడా నియమావళికి వ్యతిరేకమని ఆదేశాల్లో పేర్కొంది.
అయితే, మతపరమైన దీక్షలను పోలీసులు వ్యతిరేకించడం కాదని, కానీ శాఖ క్రమశిక్షణకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుందని అధికారులు తెలియజేశారు. ఎవరికైనా దీక్ష చేపట్టాలనే ఆసక్తి ఉంటే వారు ముందస్తుగా సెలవు కోసం దరఖాస్తు చేస్తే, రెండు నెలల వరకు సెలవులు మంజూరు చేయడానికి శాఖ సిద్ధంగా ఉందని వెల్లడించారు. అయితే, దీక్షలో ఉంటూ విధులకు హాజరుకావడం మాత్రం కఠినంగా నిషేధించబడిందని క్లారిటీ ఇచ్చారు.