COVID Review: అన్ని జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం, అర్హులైన వారు టీకా వేసుకోవాలని సూచన, మాస్కులు ధరించని వారిపై చర్యలకు ఆదేశం
కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచేందుకు, అన్ని జిల్లాల్లోనూ కరోనాను నిర్ధారించే ఆర్టిపిసిఆర్ పరీక్షా కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన మేరకు ఆర్టిపిసిఆర్ కిట్స్ తక్షణమే తెప్పించాలని అధికారులను ఆదేశించారు.
Hyderabad, April 9: దేశవ్యాప్తంగా కరోనా తిరిగి వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ మాస్కులు ధరించి సునిశిత జాగ్రత్తలు పాటించాలని, కరోనా కట్టడికోసం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను కోరారు.
రాష్ట్రంలో ముఖ్యంగా జనం రద్దీగా ఉండే ప్రాంతాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజలతో పాటు కార్పోరేషన్లు, మున్సిపాలిటీల ప్రజలు కరోనా పట్ల మరింత అప్రమత్తతతో మెలగాలని సీఎం సూచించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎం కేసీఆర్, అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో, రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... రాష్ట్రంలో కరోనా తిరిగి పునరావృతమౌతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలను భారీగా పెంచాలని అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాలకు చెందిన ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కి వందశాతం వ్యాక్సినేషన్ చేయించాలన్నారు. ఈ ప్రక్రియను వారం రోజుల్లో యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పోలీస్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఆర్టీసీ , రెవెన్యూ శాఖల్లో పనిచేసే సిబ్బంది మొత్తానికి వాక్సినేషన్ ప్రక్రియను వారం రోజుల్లో నూటికి నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో వెంటనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. వాక్సినేషన్ పురోగతిని ప్రతీ రోజు ఆయా శాఖల ఉన్నతాధికారులు సీఎంవోకు రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు.
కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచేందుకు, అన్ని జిల్లాల్లోనూ కరోనాను నిర్ధారించే ఆర్టిపిసిఆర్ పరీక్షా కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన మేరకు ఆర్టిపిసిఆర్ కిట్స్ తక్షణమే తెప్పించాలని అధికారులను ఆదేశించారు.
గద్వాల, వనపర్తి, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, పెద్దపల్లి, రామగుండం, భువనగిరి, జనగామ, వికారాబాద్ కేంద్రాల్లో ఆర్టిపిసిఆర్ పరీక్షా కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని వైద్య అధికారులను సీఎం ఆదేశించారు.
కరోనా నియంత్రణ కోసం కీలకమైన మాస్కులు ధరించే నిబంధనను కఠినంగా అమలు పరచాలన్నారు. ప్రజలు మాస్కు ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధించేలా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో... ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఈ నిబంధనను అందరూ పాటించేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని డిజిపిని సీఎం ఆదేశించారు. 45 సంవత్సరాల పైబడిన వారందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ప్రజలను సీఎం కోరారు.
(The above story first appeared on LatestLY on Apr 09, 2021 09:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

