Vijayashanti Quits BJP: అనుకున్నదే అయింది! బీజేపీకి షాక్ ఇచ్చిన రాములమ్మ, మరోసారి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న విజయశాంతి, కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరం, మెదక్ పార్లమెంట్ సీటు ఆఫర్ చేసిన కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి (BJP) బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను (Vijayashanti Quits BJP) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి (Kishan Reddy) పంపించారు. గత కొంతకాలంగా ఆమె రాష్ట్ర పార్టీ అధిష్టానం తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
Hyderabad, NOV 16: అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి (BJP) బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను (Vijayashanti Quits BJP) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి (Kishan Reddy) పంపించారు. గత కొంతకాలంగా ఆమె రాష్ట్ర పార్టీ అధిష్టానం తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తనపట్ల పార్టీ పెద్దలు అవలంభిస్తున్న వైఖరిపైనా అసంతృప్తితో ఉన్న ఆమె.. పార్టీ కార్యక్రమాల్లోనూ కొద్దికాలంగా అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే విజయశాంతి బీజేపీని వీడుతున్నట్లు (Vijayashanti Quits BJP) విస్తృత ప్రచారం జరిగింది. అయితే, పలు సందర్భాల్లో పార్టీ మార్పు విషయంపై ఎలాంటి ఆలోచన లేదని ఆమె చెబుతూ వచ్చినప్పటికీ.. రాష్ట్ర పార్టీలో నేతల మధ్య అంతర్గత విబేధాల నేపథ్యంలో ఆమె పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిసింది. బండి సంజయ్ ను రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించినప్పటి నుంచి విజయశాంతి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదని ప్రచారం జరిగింది. కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వేదికపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar reddy) ఉండడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. తెలంగాణ ద్రోహులతో కలిసి వేదికను పంచుకోలేకనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు విజయశాంతి అప్పట్లో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనికితోడు పలు సందర్భాల్లో బీజేపీ అధిష్టానం వ్యవహారశైలిని ఆమె తప్పుపడుతూ ట్వీట్లు చేస్తూ వచ్చారు.
బీజేపీ అధిష్టానం ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు 40 మందితో స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో విజయశాంతికి చోటు దక్కలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. జరిగిన తప్పును గుర్తించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్టార్ క్యాంపెయినర్ గా ఎమ్మెల్యే రఘునందన్ తో పాటు విజయశాంతిని నియమిస్తున్నట్లు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. అయినా ఆమె సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలోనే విజయశాంతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రకటించడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే, ఆ తరువాతరోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన విశ్వరూప మహాసభకు హాజరయ్యేందుకు హైదరాబాద్ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు. బేగంపేట్ ఎయిర్ పోర్టులో మోదీకి విజయశాంతి స్వాగతం పలకడంతో ఆమె పార్టీ మారుతున్నట్లు జరిగిన ప్రచారానికి చెక్ పెట్టినట్లయింది.
మోదీ బహిరంగ సభ తరువాత విజయశాంతి ట్విటర్, ఫేస్ బుక్ ఖాతాల్లో ప్రొఫైల్ పిక్ మార్చడంతో బీజేపీని వీడటం ఖాయమన్న ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రచారాన్ని నిజంచేస్తూ బుధవారం ఆమె బీజేపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేయగా.. తాజాగా విజయశాంతికూడా ఆ పార్టీకి రాజీనామా చేయడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలాఉంటే.. విజయశాంతి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రేపటి నుంచి రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. ఈ క్రమంలో విజయశాంతి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరతారని సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు ఆమెతో చర్చలు జరిపారని, మెదక్ పార్లమెంట్ సీటును ఆమెకు కేటాయించేందుకు అధిష్టానం ఒకే చెప్పినట్లు తెలిసింది.
(The above story first appeared on LatestLY on Nov 16, 2023 10:10 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

