Hyd, June 18: మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రస్తుతం ఐటీఐల్లో విద్యార్థులకు నేర్పించే నైపుణ్యాలు ఉపయోగం లేకుండా పోయాయని అభిప్రాయ పడ్డారు. 50 ఏళ్ల నాటి నైపుణ్యాలను ఐటీఐల్లో నేర్పిస్తున్నారని, అప్ గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందన్నారు.
ఐటీఐలను ఐటీసీలుగా మారుస్తున్నామని ప్రకటించారు. ఇందుకోసం టాటా సంస్థ సహకారం తీసుకుంటున్నామని వెల్లడించారు. విద్యార్థులు, నిరుద్యోగులను నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని వివరించారు. తన ఆలోచనల నుంచి వచ్చిందే ఏటీసీ సెంటర్స్ అని పేర్కొన్నారు. మేం పాలకులు, మీరు బానిసలు అనే ఆలోచన లేదు. మేం సేవకులం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ఒకేసారి భారీ సంఖ్యలో ఐపీఎస్ లకు స్థానచలనం.. ఏకంగా 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ... వివరాలు ఇవిగో!
రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులున్నారు. వారి విలువైన కాలాన్ని వృథా చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపట్టాం. నేను ఇల్లు కట్టుకునే సమయంలో ఇంజినీరింగ్ గ్రాడుయేట్స్ వచ్చి రూ.15 వేలు, రూ.20 వేలకు పనిచేస్తామని వచ్చారు. అదే మేస్త్రీలు, నిర్మాణ రంగంలో అనుభవం ఉన్నవారిని సంప్రదిస్తే రూ.60 వేలు అడిగారని సీఎం తెలిపారు. సర్టిఫికెట్లు జీవన ప్రమాణాలను పెంచడం లేదని అప్పుడే అర్థమైందన్నారు.
40 లక్షల మంది యువతీ యువకులు ఉపాధి లేక రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూ తిరుగుతున్నారు. సర్టిఫికెట్ ఉంటే సరిపోదు సాంకేతిక నైపుణ్యం ఉండాలి. సాంకేతిక నైపుణ్యం ఉంటే ఉపాధి లభిస్తుందని విశ్వసిస్తా. సర్టిఫికెట్స్ జీవన ప్రమాణాలు పెంచవు. గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్లకుండా ప్రభుత్వం ఉపాధి గ్యారంటీ ఇస్తుంది. ఎంతోమంది గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు. ఇక్కడే అలాంటి ఉపాధి అవకాశాలు కల్పించి ఎవరూ విదేశాలకు వెళ్లకుండా చేస్తాం. రోబోలు మొదలుకొని అత్యాధునిక యంత్రాలు తీసుకొచ్చి యువతకు శిక్షణ అందించాలని భావిస్తున్నామన్నారు.
టాటా సంస్థ సహకారంతో సాంకేతిక నైపుణ్యాల కోసం రూ.2,324 కోట్లతో 65 ఐటీఐలు ఐటీసీలుగా మారుస్తున్నాం. విద్యార్థుల శిక్షణ కోసం ముందుకు వచ్చిన టాటా యాజమాన్యానికి ధన్యవాదాలు. ఐటీ రంగంలో ప్రపంచంలో తెలుగు వారు పోటీ పడుతున్నారు. మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించడమే మా బాధ్యత. రాష్ట్రంలో గల 65 ఐటీఐలను అధునాతనంగా తీర్చిదిద్దుతాం. నైపుణ్యాలను నేర్పించి నిరుద్యోగులకు భరోసా కల్పిస్తాం. విద్యార్థిని విద్యార్థులు ఐటీఐల్లో చేరాలి. ఈ శాఖ తన వద్ద ఉంటుంది. నేనే స్వయంగా పర్యవేక్షిస్తా. ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తా అని’ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ఐటీఐలను ఆధునికీకరణ చేసేందుకు రూ.2,324.21 కోట్ల నిధులు ఖర్చుచేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఐటీఐలను అడ్వాన్స్డ్ అప్‌గ్రేడ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చనుంది. ఏటీసీలుగా మార్చేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదిరింది. ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా వాటిలో యువతకు శిక్షణ ఇవ్వనున్నారు.
అందుకోసం అధునాతన సామగ్రి, సాంకేతికత ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏటీసీల్లో శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను నియమించింది. ఏటా 15, 860 మందికి 6 రకాల కోర్సుల్లో లాంగ్‌టర్మ్ కోచింగ్ లభించనుంది. అలాగే 31,200 మందికి 23 రకాల కోర్సుల్లో షార్ట్ టర్మ్ కోచింగ్ ఇవ్వనుంది. ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.307.96 కోట్లు కాగా.. టీటీఎల్ వాటా రూ.2016.25 కోట్లు. ఏటీసీల్లో శిక్షణ పొందిన వారికి టీటీఎల్ ఉద్యోగాలు కల్పించనుంది.