Fresh Flood Alert in Nepal: నేపాల్‌లో మళ్లీ వరద ముప్పు.. డేంజర్ మార్క్ దాటిన మూడు ప్రధాన నదులు.. నదీ తీర ప్రాంతాల్లో హై అలర్ట్..
భారీ ప్రాణనష్టంతో విషాదంలో ఉన్న నేపాల్‌కు ఇప్పుడు మరోసారి వరదల ముప్పు ఎదురవుతోంది. ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వర్షాలు కొనసాగితే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉండటంతో అధికారులు అత్యవసర సహాయక చర్యలకు సిద్ధమవుతున్నారు.
Fresh Flood Alert in Nepal: ఇటీవల సంభవించిన భారీ వరదల విధ్వంసం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే నేపాల్‌కు మరోసారి వరద ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం. దేశంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో మూడు ప్రధాన నదుల్లో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయిని దాటాయి. దీంతో మధ్య, తూర్పు, పశ్చిమ నేపాల్ ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
నేపాల్ వరద అంచనా విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో సున్ కోషి, బుధి గండకి, మహాకాళి నదుల్లో నీటి మట్టాలు హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే భారీ వర్షాలతో అనేక ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. లోతట్టు ప్రాంతాలు, నదీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు సిద్ధంగా ఉండాలని విపత్తు నిర్వహణ అధికారులు హెచ్చరించారు.
నేపాల్ వరదలు హెచ్చరిక.. హిమాలయాల్లో భారీ విపత్తు.. చైనా మెగా డ్యామ్‌లు భారత్‌కు కొత్త ముప్పా..
లామ్‌జంగ్ జిల్లాలో ప్రవహించే మార్ష్యాంగ్డి నదిలో కూడా నీటి మట్టం మంగళవారం అర్ధరాత్రి డేంజర్ మార్క్‌ను దాటినట్లు అధికారులు వెల్లడించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదుల్లోకి ఒక్కసారిగా భారీగా వరద నీరు చేరుతోందని తెలిపారు. ముంపు ప్రమాదం ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ అథారిటీ (NDRRMA) సూచించింది. నిరంతర వర్షాల కారణంగా సహాయక, గాలింపు చర్యలకు కూడా ఆటంకం కలుగుతోందని సమాచారం.
ఇటీవల సంభవించిన విపత్తు తీవ్రతను తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.బుధవారం నాటికి నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో కలిపి మృతుల సంఖ్య 1,130కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 1,113 మృతదేహాలకు పోస్టుమార్టం, చట్టపరమైన గుర్తింపు ప్రక్రియలు పూర్తయ్యాయి. అయితే, ఇప్పటివరకు కేవలం 95 మృతదేహాలను మాత్రమే బంధువులకు అప్పగించినట్లు సమాచారం. గుర్తింపులేని 911 మృతదేహాలకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు 6,541 మందిని రక్షించగా, 4,858 మంది ఇంకా గల్లంతైనట్లు అధికారులు పేర్కొన్నారు. గల్లంతైన వారి కోసం ఆర్మీ, పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. సుమారు 7,912 మంది సిబ్బంది ఈ గాలింపు, సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. హెలికాప్టర్లు, డ్రోన్లు, ప్రత్యేక పరికరాల సహాయంతో మారుమూల ప్రాంతాల్లోనూ గాలింపు కొనసాగుతోంది.