Nepal Flood Disaster: నేపాల్ మృత్యుఘోష.. విపత్తు సంభవించి రోజులు గడుస్తున్నా.. ఇంకా కానరాని 600 మంది పసి పిల్లల జాడ..
ఆగస్టు 26న నేపాల్‌ను ముంచెత్తిన ఘోర హిమానీనద ఆకస్మిక వరదల దాటికి వేలాది కుటుంబాలు చెల్లాచెదురవగా.. ఆ విపత్తు ఇప్పుడు గుండెను పిండేస్తోంది. తీవ్రంగా దెబ్బతిన్న రసువా, నువాకోట్ జిల్లాల్లో సుమారు 600 మంది పిల్లల ఆచూకీ తెలియడం లేదని 'ది కాఠ్మండు పోస్ట్' పత్రిక కథనం వెల్లడించింది
Nepal Flood Disaster: ఆగస్టు 26న నేపాల్‌ను ముంచెత్తిన ఘోర హిమానీనద ఆకస్మిక వరదల దాటికి వేలాది కుటుంబాలు చెల్లాచెదురవగా.. ఆ విపత్తు ఇప్పుడు గుండెను పిండేస్తోంది. తీవ్రంగా దెబ్బతిన్న రసువా, నువాకోట్ జిల్లాల్లో సుమారు 600 మంది పిల్లల ఆచూకీ తెలియడం లేదని 'ది కాఠ్మండు పోస్ట్' పత్రిక కథనం వెల్లడించింది. విపత్తు సంభవించి రోజులు గడుస్తున్నా.. తమ పిల్లలు క్షేమంగా ఉన్నారో లేదో తెలియక, ఫోన్ కాల్స్ అందక వందలాది కుటుంబాలు ఆశ, తీవ్ర భయాల మధ్య కాలం వెళ్లదీస్తున్నాయి.
సమాచార వ్యవస్థలు పూర్తిగా ధ్వంసం కావడం, రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో సహాయక చర్యలు, వివరాల సేకరణ అత్యంత సంక్లిష్టంగా మారాయి. పిల్లల సమాచారాన్ని అందించే ప్రధాన వనరులైన పాఠశాలలు ధ్వంసమవ్వడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. రసువాలో నాలుగు, నువాకోట్‌లో ఎనిమిది కలిపి మొత్తం 12 పాఠశాలలు వరద ధాటికి పూర్తిగా కొట్టుకుపోయాయి.
ఈ వరదల విధ్వంసానికి మీరే కారణం.. భారత్, చైనా, అమెరికా నుంచి నష్ట పరిహారం డిమాండ్ చేసిన నేపాల్..
తమ పాఠశాల ప్రాంగణాలు బీడు నదీ తీరాల్లా మారిపోయాయని.. పరిస్థితి తమను రాతియుగంలోకి నెట్టివేసినట్లుగా ఉందంటూ పలువురు ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రసువా, నువాకోట్, ధాడింగ్ జిల్లాల్లోనే కనీసం 17,000 మంది పిల్లలు ఈ విపత్తు వల్ల ప్రభావితులయ్యారని, వారికి తక్షణ అత్యవసర మానవతా సాయం అందించాల్సి ఉందని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ 'యూనిసెఫ్' వెల్లడించింది.
రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ వరదల కారణంగా ఇప్పటివరకు నేపాల్ వ్యాప్తంగా 1,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 4,200 మంది గల్లంతయ్యారు. కాఠ్మండులోని త్రిభువన్ యూనివర్శిటీ టీచింగ్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన 'తప్పిపోయిన వారి గోడ' (Wall of Missing) ప్రాంగణం, గుర్తించని మృతదేహాలతో తమ బంధువుల ఫోటోలను పోల్చి చూసుకునేందుకు వచ్చిన కుటుంబీకులతో శోకసంద్రంగా మారింది. సమాచార పునరుద్ధరణ పూర్తయి, అధికారులు భౌతికంగా ధృవీకరించే వరకు తప్పిపోయిన చిన్నారుల ఖచ్చితమైన వివరాలు తేలవని స్థానిక పాలనా యంత్రాంగం చెబుతోంది. పగిలిన రోడ్లు, దెబ్బతిన్న జలవిద్యుత్ ప్రాజెక్టుల శిథిలాల నడుమ ఇంకా ప్రాణాలతో ఉన్న వారిని కాపాడేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.