Nepal Flood Disaster: ఈ వరదల విధ్వంసానికి మీరే కారణం.. భారత్, చైనా, అమెరికా నుంచి నష్ట పరిహారం డిమాండ్ చేసిన నేపాల్..

నేపాల్ విషాదం ఇప్పుడు కేవలం ఒక ప్రకృతి విపత్తు కథ మాత్రమే కాదు.. వాతావరణ మార్పులకు బాధ్యత వహించాల్సిన దేశాలపై ప్రపంచవ్యాప్తంగా న్యాయం కోసం వినిపిస్తున్న కొత్త డిమాండ్‌గా మారుతోంది.

In this photo released by Xinhua News Agency, a drone photo shows a flood-hit area in Nuwakot, Nepal on Thursday, Aug. 27, 2026. (Sulav Shrestha/Xinhua via AP)

Nepal Flood Disaster: నేపాల్‌ను కుదిపేసిన ఘోర జలప్రళయం వేలాది కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపిన వేళ.. ఆ దేశ ప్రభుత్వం ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముందు కీలక డిమాండ్‌ను ఉంచింది. వాతావరణ మార్పుల కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని పేర్కొంటూ.. ప్రపంచంలో అత్యధికంగా గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేస్తున్న భారత్, చైనా, అమెరికా నుంచి వాతావరణ మార్పుల నష్టపరిహారం కోరింది.

భోటేకోషి నది పరివాహక ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు నేపాల్‌లో భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ విపత్తులో ఇప్పటికే 1,100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వేలాది మంది ఇంకా గల్లంతైన నేపథ్యంలో సహాయక బృందాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. గ్రామాలు కొట్టుకుపోవడం, రహదారులు, వంతెనలు ధ్వంసం కావడం, జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతినడం వంటి పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

నేపాల్‌లో మళ్లీ వరద ముప్పు.. డేంజర్ మార్క్ దాటిన మూడు ప్రధాన నదులు.. నదీ తీర ప్రాంతాల్లో హై అలర్ట్..

ఈ విపత్తుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ ఆరోపించారు. హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా హిమనీనదాలు వేగంగా కరుగుతున్నాయని, గ్లేసియర్ సరస్సులు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అకస్మాత్తుగా మంచు, హిమనీనదాల భాగాలు విరిగిపడటం, భారీ వర్షాలు కలిసిరావడం వల్ల ఇలాంటి జలప్రళయాలు సంభవిస్తున్నాయని తెలిపారు.

వాతావరణ మార్పులకు నేపాల్ వంటి చిన్న దేశాల పాత్ర చాలా తక్కువగా ఉన్నప్పటికీ, దాని తీవ్ర ప్రభావాన్ని మాత్రం తామే ఎదుర్కొంటున్నామని ఖనాల్ ఆవేదన వ్యక్తం చేశారు. భారీ పారిశ్రామికీకరణ, అధిక కార్బన్ ఉద్గారాలకు కారణమైన దేశాలు తమ చర్యల ఫలితంగా ఏర్పడుతున్న నష్టానికి బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు.

ఇది సాయం కాదు.. భిక్ష కాదు.. మా ప్రజలకు జరిగిన నష్టానికి న్యాయం అనే కోణంలో నేపాల్ తన వాదనను అంతర్జాతీయ వేదికలపై వినిపించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు విపత్తులు సంభవించినప్పుడు ఇతర దేశాల నుంచి సహాయం కోరే విధానాన్ని అనుసరించిన నేపాల్.. ఇప్పుడు ఆ విధానాన్ని మార్చుకుని క్లైమేట్ జస్టిస్, లాస్ అండ్ డ్యామేజ్ అంశాలను ప్రధానంగా ముందుకు తీసుకురావాలని నిర్ణయించింది.

ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని గ్లోబల్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ దృష్టికి తీసుకెళ్లాలని నేపాల్ ప్రభుత్వం యోచిస్తోంది. రానున్న ఐరాస సర్వసభ్య సమావేశాల్లో కూడా ఈ విపత్తు, వాతావరణ న్యాయం అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. వరదల కారణంగా ధ్వంసమైన రహదారులు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులు, నివాస ప్రాంతాల పునర్నిర్మాణానికి ప్రాథమికంగా 4 నుంచి 5 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు.

అయితే నేపాల్ డిమాండ్ ఇప్పుడు అంతర్జాతీయంగా కొత్త చర్చకు దారితీసే అవకాశం ఉంది. వాతావరణ మార్పులకు బాధ్యత ఎవరిది? దాని ప్రభావాన్ని ఎదుర్కొంటున్న పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు నష్టపరిహారం ఎవరు చెల్లించాలి? అనే ప్రశ్నలు మరోసారి ప్రపంచం ముందుకు వచ్చాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement