TS Inter Second Year Results 2021: మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి, ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు, ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలకు సంబంధించి మార్గదర్శకాలు ఖరారు చేసిన తెలంగాణ విద్యాశాఖ, జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో విచారణ
తెలంగాణలో ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలకు (TS Inter Second Year Results 2021) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించనున్నట్లు ప్రకటించింది.
తెలంగాణలో ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలకు (TS Inter Second Year Results 2021) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించనున్నట్లు ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటర్ పరీక్షలను (TS Inter Exams 2021) ప్రభుత్వం రద్దు చేసింది. ఫస్టియర్ విద్యార్థులను నేరుగా సెకండియర్‌కి ప్రమోట్ చేయగా.. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు సంబంధించి ఫలితాలను వెల్లడించనుంది. తాజాగా దీనిపై మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇంటర్ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపింది. గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు 35 శాతం మార్కులను, బ్యాక్‌లాగ్స్ ఉంటే ఆ సబ్జెక్టులకు రెండో ఏడాది 35 మార్కులను కేటాయించనున్నారు. ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది. ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగయ్యాక ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శికి విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. సెకండ్ ఇయర్ విద్యార్థులకు మార్కుల కేటాయింపు విషయంలో మార్గదర్శకాలు రూపొందించడంతో త్వరలోనే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల కానున్నాయి. సుమారు 4.50 లక్షల మంది విద్యార్థులు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఇక రాష్ట్రంలో జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో విచారణ జరిగింది. పాఠశాలల ప్రారంభంపై కోర్టుకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వివరణ ఇచ్చారు. అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఆన్‌లైన్ బోధన కూడా కొనసాగుతుందని వివరించారు. విద్యా సంస్థలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. అయితే పాఠశాలల్లో భౌతికదూరం పాటించడం కష్టమని కోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని విధివిధానాలు ఖరారు చేస్తామని సుల్తానియా తెలిపారు. దీంతో వారం రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని విద్యా శాఖను హైకోర్టు ఆదేశించింది.
(The above story first appeared on LatestLY on Jun 23, 2021 05:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

