Repo Rate Hike Impact: హోమ్ లోన్ కస్టమర్లకు అలర్ట్.. RBI రెపో రేటు పెంపుతో EMI ఎంత పెరుగుతుందో తెలుసుకోండి..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) పెంచి 5.50 శాతానికి చేర్చడం దేశంలోని గృహ రుణగ్రహీతల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. 2023 ఫిబ్రవరి తర్వాత రెపో రేటులో పెంపు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి.
Repo Rate Hike Impact: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) పెంచి 5.50 శాతానికి చేర్చడం దేశంలోని గృహ రుణగ్రహీతల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. 2023 ఫిబ్రవరి తర్వాత రెపో రేటులో పెంపు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల , రూపాయి విలువ క్షీణతను అదుపు చేయడమే లక్ష్యంగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, దీని ప్రభావం నేరుగా సామాన్య పౌరులు , మిడిల్ క్లాస్ హోమ్ లోన్ ఖాతాదారులపై తీవ్రంగా పడనుంది. ద్రవ్యోల్బణం పెరుగుదల వేళ RBI కీలక నిర్ణయం.. రెపో రేటు 5.5 శాతానికి పెంపు
వాణిజ్య బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటే రెపో రేటు. ఇది పెరిగినప్పుడు బ్యాంకులకు నిధుల సమీకరణ వ్యయం పెరుగుతుంది. బ్యాంకులు ఈదనపు భారాన్ని రుణగ్రహీతలకు బదిలీ చేస్తాయి. ప్రస్తుతం దాదాపు అన్ని వాణిజ్య బ్యాంకులు అందించే హోమ్ లోన్లు ఆర్‌బీఐ రెపో రేటుతో అనుసంధానమైన (EBLR/RLLR) ఫ్లోటింగ్ రేటు విధానంలోనే పనిచేస్తున్నాయి. దీంతో బ్యాంకులు తమ రుణ వడ్డీ రేట్లను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఇల్లు కొనుగోలు చేసిన కోట్లాది మంది పౌరుల నెలవారీ ఈఎంఐలు (EMI) పెరగడం లేదా రుణం తీరే కాలపరిమితి (Tenure) భారీగా పొడిగించబడటం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ పెంపు ప్రభావాన్ని ఒక ఆచరణాత్మక ఉదాహరణ ద్వారా పరిశీలిస్తే దీని తీవ్రత స్పష్టమవుతుంది. ఉదాహరణకు, ఒక రుణగ్రహీత రూ.50 లక్షల హోమ్ లోన్‌ను 20 ఏళ్ల కాలపరిమితికి 8.50 శాతం వడ్డీతో తీసుకున్నారనుకుంటే, ఆయన ప్రతి నెలా రూ.43,391 ఈఎంఐగా చెల్లిస్తున్నారు. బ్యాంకులు తాజా రెపో రేటు పెంపును వర్తింపజేసి వడ్డీ రేటును 8.75 శాతానికి పెంచితే, అదే 20 ఏళ్ల వ్యవధికి నెలవారీ ఈఎంఐ రూ.44,191కు పెరుగుతుంది. అంటే సదరు రుణగ్రహీతపై నెలకు దాదాపు రూ.800 అదనపు భారం పడుతుంది. ఈ స్వల్ప వ్యత్యాసమే పూర్తి 20 ఏళ్ల కాలపరిమితి ముగిసేసరికి ఏకంగా రూ.1.92 లక్షల అదనపు వడ్డీ చెల్లింపుకు దారితీస్తుంది. ఒకవేళ రుణగ్రహీతలు నెలవారీ ఈఎంఐ పెంచకుండా పాత మొత్తాన్నే కొనసాగిస్తే, వారి రుణ కాలపరిమితి మరికొన్ని నెలలు అదనంగా పెరుగుతుంది.
అయితే, రెపో రేటు పెరిగిన మరుసటి రోజే ఈఎంఐలు మారవు. ప్రతి బ్యాంకు తమ రీ-రీసెట్ చక్రం (Reset Cycle) ఆధారంగా ఈ మార్పులను అమలు చేస్తుంది. దీంతో ఇప్పటికే హోమ్ లోన్ చెల్లిస్తున్న వారు తమ రుణం ఫ్లోటింగ్ రేటులో ఉందో లేదో సరిచూసుకోవాలి. ఈఎంఐ పెంచుకోవాలా లేదా రుణ వ్యవధిని పొడిగించుకోవాలా అనే అంశంపై బ్యాంకు అధికారులతో స్పష్టత తెచ్చుకోవడం శ్రేయస్కరం. ఆర్థిక నిపుణుల సలహా ప్రకారం—ఈఎంఐ భారాన్ని భరించగలిగే వెసులుబాటు ఉన్నవారు కాలపరిమితి పెంచుకోకుండా ఈఎంఐని పెంచుకోవడమే శ్రేయస్కరం. దీనివల్ల దీర్ఘకాలికంగా చెల్లించాల్సిన వడ్డీ భారం తగ్గుతుంది. అంతేకాకుండా, సంవత్సరానికి కనీసం ఒక లంప్‌సమ్ పాక్షిక చెల్లింపు (Partial Prepayment) చేయడం ద్వారా ఈ పెరిగిన వడ్డీ ప్రభావాన్ని అధిగమించవచ్చు.
మరోవైపు, కొత్తగా సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి కూడా రుణ వ్యయం భారం కానుంది. కొత్త రుణగ్రహీతలు కేవలం ఆకర్షణీయమైన ప్రారంభ వడ్డీ రేట్లనే కాకుండా, భవిష్యత్తులో రేట్లు మారితే తట్టుకునేలా తమ ఆర్థిక బడ్జెట్‌ను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులను సరిపోల్చుకోవడం ఇప్పుడు అత్యంత అవసరంగా మారింది. మొత్తం మీద, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం, ఇల్లు కొనుగోలుదారుల బడ్జెట్‌ను తలకిందులు చేస్తూ వారిపై సుదీర్ఘ కాలం పాటు కొనసాగే అదనపు ఆర్థిక భారాన్ని మోపింది.