EPFO, ITR డేటా దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ఆందోళన.. కేంద్రానికి కీలక సూచనలు
ప్రావిడెంట్ ఫండ్ (EPFO), ఆదాయపు పన్ను (ITR) రికార్డుల్లోని సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్ సంస్థలు సులువుగా యాక్సెస్ చేయడంపై భారత సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పీఎఫ్, ఐటీ డేటాను విశ్లేషించి ధృవీకరించే వాణిజ్య సాంకేతిక వ్యవస్థలు విస్తరించడం సార్వభౌమ డేటా భద్రతకు సవాలుగా మారుతోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
EPFO, ITR Data Privacy: ప్రావిడెంట్ ఫండ్ (EPFO), ఆదాయపు పన్ను (ITR) రికార్డుల్లోని సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్ సంస్థలు సులువుగా యాక్సెస్ చేయడంపై భారత సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పీఎఫ్, ఐటీ డేటాను విశ్లేషించి ధృవీకరించే వాణిజ్య సాంకేతిక వ్యవస్థలు విస్తరించడం సార్వభౌమ డేటా భద్రతకు సవాలుగా మారుతోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చట్టబద్ధంగా ప్రభుత్వానికి సమర్పించే సమాచారం ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లి దుర్వినియోగం కాకుండా ఉండేందుకు తగిన రక్షణ చర్యలు, యంత్రాంగాన్ని రూపొందించాలని కేంద్రాన్ని కోరింది.
ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, న్యాయమూర్తులు జయమల్య బాగ్చి, వి. మోహనలతో కూడిన ధర్మాసనం సోమవారం పీయూష్ శర్మ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిఐఎల్) విచారణకు స్వీకరించింది. పౌరులు తమ చట్టబద్ధమైన బాధ్యతల్లో భాగంగా ప్రభుత్వ అధికారులకు అందించే సున్నితమైన వ్యక్తిగత సమాచారం వాణిజ్యపరంగా దుర్వినియోగం కావడం ఆందోళనకరమని ధర్మాసనం పేర్కొంది. ఈ సమస్యపై తగిన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయా రంగ నిపుణుల సహాయంతో కేంద్ర ప్రభుత్వం ఒక సమర్థవంతమైన వ్యవస్థను రూపొందించాలని సీజేఐ సూచించారు.
కొత్త EPFO పోర్టల్‌లో 8 కీలక సేవలు.. UAN యాక్టివేషన్ నుంచి PF విత్‌డ్రా వరకు ఇవే
విచారణ సందర్భంగా పిటిషనర్ తన వ్యక్తిగత అనుభవాన్ని వివరించారు. ఒక ప్రైవేట్ ధృవీకరణ ప్రక్రియలో కేవలం పాన్ (PAN), యుఏఎన్ (UAN) వివరాలను సమర్పించగా, ఆ సంఖ్యలకు అనుసంధానించబడిన తన పూర్తి ఉద్యోగ చరిత్ర బయటకు వచ్చిందని తెలిపారు. ఈ ప్రక్రియలో కనీసం ఓటీపీ (OTP) పొందడం, స్పష్టమైన సమ్మతి (Consent) తీసుకోవడం లేదా అధికారిక గుర్తింపు ధృవీకరణ వంటి ప్రాథమిక భద్రతా చర్యలు లేవని ఎత్తిచూపారు. అయితే ఇది ప్రభుత్వ సంస్థల ద్వారా జరిగిన డేటా లీకేజీ కాదని, డేటా భద్రతకు సరైన రక్షణ లేకపోవడమే కారణమని పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రైవేట్ సంస్థలు ఉపాధి ధృవీకరణ, ద్వంద్వ ఉద్యోగాల (Moonlighting) స్క్రీనింగ్, లేబర్ మార్కెట్ ప్రొఫైలింగ్ వంటి ప్రయోజనాల కోసం పీఎఫ్, ఐటీ రికార్డులను ఆధారంగా చేసుకుంటున్నాయని పిటిషనర్ వివరించారు. ఈ అంశాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వ్యక్తిగత డేటా దుర్వినియోగాన్ని నిరోధించడానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.