
Vjy, Mar 10: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మరోసారి విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు తోసిపుచ్చింది. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. అదే సమయంలో వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 12 వ తేదీకి వాయిదా వేసింది.
ఈ కేసు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సత్యవర్థన్ తరపు న్యాయవాది రెండు రోజులు సమయం కోరారు. దాంతో బెయిల్ పిటిషన్ పై విచారణను 12కు వాయిదా వేసింది విజయవాడ కోర్టు (Vijayawada Court). అదే సమయంలో వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi Case) ఉంటున్న బ్యారక్ మార్చాలని దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ జరిగింది. అయితే ఇతర ఖైదీలు ఉంటున్న బ్యారక్ లోకి వంశీని మార్చడం కుదరదని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. భద్రతా కారణాల రీత్యా బ్యారక్ మార్చలేమని జైలు అధికారులు స్పష్టం చేశారు. కాగా, మెత్తటి దిండు, దుప్పటి కావాలని వంశీ కోరగా, అందుకు జైలు అధికారులు అంగీకరించారు.
వల్లభనేని వంశీ మోహన్ రిమాండ్ ఈనెల 17 వరకు పొడిగింపు, సీఐడీ పీటీ వారెంట్ పై విచారణ జరిపిన కోర్టు
జైలు బ్యారక్‌లో తనను ఒంటరిగా ఉంచారని గత నెల చివర్లో పిటిషన్ దాఖలు చేశారు వల్లభనేని వంశీ. భద్రతాపరంగా తనకు ఇబ్బంది లేనప్పటికీ అందరూ ఉన్న సెల్‌లోకి తనను మార్చాలని కోరారు. తన భర్త అరెస్టు అక్రమమని తేల్చేందుకు అవసరమైన సీసీ ఫుటేజ్ ను భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వల్లభనేని వంశీ భార్య హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సీసీ ఫుటేజ్‌ను భద్రపరచాలంటూ పోలీసుల్ని ఆదేశించింది.