PM Modi’s Independence Day 2026 Speech: ఎర్రకోట నుంచి వరాల జల్లులు కురిపించిన ప్రధాని మోదీ.. యువత, టెక్నాలజీ, క్రీడలే లక్ష్యంగా పలు కీలక ప్రకటనలు
దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 13వ సారి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
PM Modi’s Independence Day 2026 Speech: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 13వ సారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో జాతీయ గీతంతో పాటు జాతీయ గేయం 'వందేమాతరం' 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎర్రకోటపై తొలిసారిగా వందేమాతరం నినాదాలు మిన్నుముట్టాయి. భారతీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన 105 mm లైట్ ఫీల్డ్ గన్‌లతో 21 తుపాకుల సెల్యూట్ నడుమ, వాయుసేన హెలికాప్టర్లు పతాకంపై పూలవర్షం కురిపించాయి.
దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ ('వికసిత్ భారత్')గా మార్చేందుకు ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా 'సప్తధార' అనే 7 సూత్రాల సమగ్ర ప్రణాళికను ఆవిష్కరించారు. తయారీ రంగం (మ్యానుఫాక్చరింగ్), వ్యవసాయం-ఆహార శుద్ధి, సాంకేతికత-నూతన ఆవిష్కరణలు, లాజిస్టిక్స్ (గతిశక్తి), రక్షణ రంగం, గ్రీన్-బ్లూ ఎకానమీ మరియు సాఫ్ట్ పవర్ రంగాలు ఈ సప్తధారలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన వెల్లడించారు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించనుందని ప్రధాని ప్రకటించారు. ఖరీదైన శిక్షణా సంస్థల వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు అప్పులపాలు కాకుండా డిజిటల్ మౌలిక వసతులతో ఈ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు రాబోయే ఏడాది కాలంలోనే కోటి మంది భారతీయ యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.
భారత్‌ను ప్రపంచ క్రీడా శక్తిగా మార్చేందుకు 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు, అత్యధిక విభాగాల్లో అథ్లెట్లు పాల్గొనేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా 5 నుంచి 15 ఏళ్ల వయస్సు గల చిన్నారుల్లో క్రీడా నైపుణ్యాలను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యేక 'టాలెంట్ హంట్' కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు.
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ రంగాన్ని బలోపేతం చేసేందుకు 3 సెమీకండక్టర్ ప్లాంట్లు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించగా, రాబోయే 7-8 ఏళ్లలో మరో 5 నుంచి 8 నూతన ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు మోదీ చెప్పారు. శక్తి భద్రత కోసం 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా 5 కొత్త అణు రియాక్టర్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకవస్తామన్నారు.
ఆధునిక సైబర్ దాడులు, విపత్తులను ఎదుర్కొనేందుకు సరిహద్దు భద్రతతో పాటు పటిష్ఠమైన పౌర రక్షణ (సివిల్ డిఫెన్స్) వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 2047 నాటికి ప్రపంచంలోని టాప్-5 బ్యాంకుల్లో కనీసం ఒక భారతీయ బ్యాంకు, ఫార్చ్యూన్ 500 జాబితాలో 50 భారత కంపెనీలు ఉండేలా ఆర్థిక సంస్కరణలు వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. 140 కోట్ల భారతీయుల భాగస్వామ్యంతోనే ఈ మహాయజ్ఞం సాధ్యమవుతుందని మోదీ పునరుద్ఘాటించారు.