Monsoon Health Tips: డెంగ్యూ నుంచి వైరల్ ఫీవర్ వరకు.. వర్షాకాలంలో ఆఫీసుకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాల్సిన ప్రమాదకర ఇన్‌ఫెక్షన్లు ఇవే..
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవడం లేదా శానిటైజర్ ఉపయోగించడం, కంప్యూటర్, కీబోర్డ్, మౌస్, మొబైల్ వంటి వస్తువులను ప్రతిరోజూ శుభ్రం చేయడం, ఇతరుల వ్యక్తిగత వస్తువులు ఉపయోగించకపోవడం, తడిసిన బూట్లు, సాక్సులను వెంటనే మార్చుకోవడం అవసరం.
Monsoon Health Tips: వర్షాకాలంలో కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మూసివున్న కార్యాలయాలు, తేమతో కూడిన వాతావరణం, సరైన వెంటిలేషన్ లేకపోవడం, తడి బూట్లు, సాక్సులు వంటి కారణాల వల్ల వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఒకే ప్రదేశంలో ఎక్కువ మంది గంటల తరబడి పనిచేసే ఆఫీసుల్లో సీజనల్ వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయని పేర్కొంటున్నారు.
నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సీజన్‌లో ఉద్యోగులను ఎక్కువగా వేధించే ఇన్ఫెక్షన్లలో ఇన్‌ఫ్లుయెంజా (ఫ్లూ), కోవిడ్-19, వైరల్ కండ్లకలక (పింక్ ఐ), వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్, సాధారణ జలుబు, ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్లు, హ్యాండ్-ఫుట్-మౌత్ డిసీజ్, లెప్టోస్పిరోసిస్ ప్రధానమైనవి. ఇవి జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, కళ్లు ఎర్రబడటం, వాంతులు, విరేచనాలు, చర్మ దురద, కండరాల నొప్పులు వంటి లక్షణాలతో ప్రారంభమవుతాయి.
భారతదేశంలోని ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) గణాంకాల ప్రకారం 2021 నుంచి 2025 మధ్య నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల కేసులు 1.7 కోట్లకు పైగా నమోదయ్యాయి. ఆఫీసు డెస్క్‌ల వద్దే భోజనం చేయడం, ఇతరుల వస్తువులు ఉపయోగించడం, అనారోగ్యంగా ఉన్నప్పటికీ కార్యాలయాలకు హాజరుకావడం వంటి అలవాట్లు ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవడం లేదా శానిటైజర్ ఉపయోగించడం, కంప్యూటర్, కీబోర్డ్, మౌస్, మొబైల్ వంటి వస్తువులను ప్రతిరోజూ శుభ్రం చేయడం, ఇతరుల వ్యక్తిగత వస్తువులు ఉపయోగించకపోవడం, తడిసిన బూట్లు, సాక్సులను వెంటనే మార్చుకోవడం అవసరం. జ్వరం లేదా ఇతర ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే కార్యాలయానికి వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవడం, అవసరమైతే వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే ప్రతి ఏడాది ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి కొంతవరకు రక్షణ పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.