Cow Dung for Coronavirus: కరోనావైరస్ నివారణకు ఆవు పేడ, ఆవు మూత్రం దివ్యౌషధాలు, అసెంబ్లీలో స్పీచ్ దంచికొట్టిన ఎమ్మెల్యే, నోరెళ్ల బెట్టిన సహచర సభ్యులు
Coronavirus- Cow dung. Representational image | Photo: IANS/NeedPix

Dispur, March 5:  చైనా నుంచి ఇతర దేశాలకు ఉచితంగా ఎగుమతి అయిన కరోనావైరస్ (Cpronavirus/ COVID 19) ప్రభావంతో ఇప్పుడు ప్రపంచం వణుకుతోంది. భారతదేశంలో (India) కూడా ఇప్పటివరకు 30 కరోనావైరస్ కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ వైరస్ కు వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేకపోవడంతో దీని వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలు సహ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అన్ని కూడా రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనావైరస్ ను నియంత్రించే మందును కనిపెట్టడం కోసం సైంటిస్టులు తలలు బద్దలు కొట్టుకుంటున్న వేళ. మన ఎమ్మెల్యే ఒకరు కరోనావైరస్ కు మందును కనిపెట్టేశారు. కరోనావైరస్ నివారణకు ఆవు పేడ, ఆవు మూతం చక్కని ఔషధాలుగా పని చేస్తాయని వారు పేర్కొన్నారు. ఆవు పేడపై అసెంబ్లీలో ఆ ఎమ్మెల్యే ఇచ్చిన స్పీచ్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరస్ కంటే వేగంగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరనుకుంటున్నారా?

వివరాళ్లోకి వెళ్దాం, అస్సాం రాష్ట్ర అసెంబ్లీ (Assam Assembly) సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా భారత్ లో కరోనావైరస్ వ్యాప్తి, నివారణ మార్గాల అంశం చర్చకు వచ్చింది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే హరిప్రియ  సుమన్ (MLA Haripriya Suman) సభలో మాట్లాడుతూ ఆవుపేడ, గోమూత్రం యొక్క ఔషధ గుణాలను వివరించారు. ఇంతవరకు బాగానే ఉంది, అయితే కరోనావైరస్ బారి నుంచి బయట పడాలంటే కూడా ఆవుపేడను ఉపయోగించాలని పేర్కొంది. అందుకు ఒక ఉదాహరణ కూడా చెప్పింది.  కరోనా కలవరం, హోళీ వేడుకలకు దూరంగా ప్రధాని మోదీ

"గుజరాత్ రాష్ట్రంలో క్యాన్సర్ కు చికిత్సను అందించే ఒక హోమియోపతి ఆసుపత్రిలో రోగులను - ఆవులను ఒకే గదిలో ఉంచుతారు. ఆవుపేడలో ఆవుమూత్రం కూడా కలిపి, బాగా పిసికి, ఆ మిశ్రమాన్ని రోగుల ఒంటినిండా పూస్తారు. ఇలా చేయడం వల్ల క్రమంగా వారి క్యాన్సర్ రోగం కొంతవరకు నయమైంది. నాకు తెలిసిన ఒక క్యాన్సర్ పేషెంట్ కూడా ఇదే విధానం అనుసరించి క్యాన్సర్ ను నయం చేసుకోగలిగాడు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా నా వద్ద ఉన్నాయి. అంత పెద్ద ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధే నయమవుతున్నప్పుడు కరోనావైరస్ ఎంత" అని ఎమ్మెల్యే హరిప్రియ సభలో స్పీచ్ దంచి కొట్టారు.

ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ స్పీచ్:

కాగా, హరిప్రియ స్పీచ్ పై ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి. ఇలాంటి వారు కూడా ఎమ్మెల్యేగా ఎలా ఎన్నికయ్యారు అంటూ వారు విమర్శలు చేస్తున్నారు.

మరోవైపు అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు చక్రపాణి మహారాజ్ కూడా కరోనావైరస్ రాకుండా గోమూత్రం చల్లాలని పిలుపునిచ్చారు. ఆవు ద్వారా వచ్చే పదార్థాలు స్వీకరించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని, దిల్లీలో జరగబోయే సభలో కరోనావైరస్ నివారణ కోసం గోమూత్రం సేవించడంతో పాటు పిడకలు తినడం, ఆవుపేడతో చేసిన అగర్బత్తిలను వెలిగించడం ద్వారా కరోనావైరస్ నివారించవచ్చు అనే ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కరోనా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అయితే వైద్య నిపుణులు మాత్రం ఇలాంటి పనులు చేయవద్దని సూచిస్తున్నారు. కరోనావైరస్ కు వ్యాక్సిన్ లేదని, నివారణ ఒకటే మార్గం అని వారు చెబుతున్నారు. ఆవు పేడ, మూత్రంలో ఎన్నోరకాల సూక్షజీవులు, క్రిములు ఉంటాయి. వాటిని స్వీకరిస్తే అది మరో రకమైన అనారోగ్యానికి దారి తీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.