Ayesha Gilani Shot Dead: పాకిస్తానీ టిక్‌టాకర్ అయేషా గిలానా దారుణ హత్య..షమ్సు బీబీని కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు
పాకిస్తాన్‌లో ప్రముఖ టిక్‌టాక్ స్టార్, 28 ఏళ్ల షమ్సు బీబీ (సోషల్ మీడియాలో 'అయేషా గిలానా'గా సుపరిచితురాలు) ఆగస్టు 14న దారుణ హత్యకు గురయ్యారు. పాకిస్తాన్ సమాఖ్య రాజధాని ఇస్లామాబాద్ సమీపంలోని తక్సిలా నగరంలో ఈ ఘోరం జరిగింది. టిక్‌టాక్‌లో సుమారు 13 లక్షల (1.3 మిలియన్లు) మంది ఫాలోవర్లను కలిగిన ఆమెను, దుండగులు కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.
బాధితురాలి తండ్రి ఫజల్ సాహిబ్జాదా పోలీసులకు అందించిన ఫిర్యాదు ప్రకారం.. కాషిఫ్ (అలియాస్ "కాశీ") అనే వ్యక్తి నుండి బీబీకి ఫోన్ కాల్ వచ్చింది. అతను ఆమెను తక్షణమే ఇంటి నుంచి బయటకు రమ్మని కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ కాల్ తర్వాత బీబీ తన 15 ఏళ్ల సోదరి అసీమా, సోదరుడు నైమతుల్లాతో కలిసి కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో ఒక పెట్రోల్ బంక్ సమీపంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన 30 నుండి 35 ఏళ్ల వయస్సు కలిగిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వారి కారుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో బీబీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె 15 ఏళ్ల చెల్లెలు అసీమా తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న తండ్రి సాహిబ్జాదా తక్సిలాలోని THQ ఆసుపత్రికి చేరుకుని, మార్చురీలో ఉన్న కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దాడికి గల కారణాలు మరియు నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Pakistani TikToker Ayesha Gilani Killed