RR vs PBKS Stat Highlights: సంజూ సొగసైన బ్యాటింగ్, పోరాడి ఓడిన రాజస్థాన్, ఐపీఎల్ 2021లో అదిరే బోణీ చేసిన పంజాబ్‌ కింగ్స్‌, 4 పరుగులతో నెగ్గి ఊపిరి పీల్చుకున్న కె.ఎల్.రాహుల్ సేన
Sanju Samson (Photo Credits: Twitter)

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ అదిరే బోణీ చేసింది. భారీస్కోర్లతో అభిమానులకు మజా పంచిన మ్యాచ్‌లో (RR vs PBKS Stat Highlights) చివరకు ఓ అసాధారణ పోరాటం నడిచింది. సోమవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో 200 పైచిలుకు పరుగులు చేసి కూడా... పంజాబ్‌ కింగ్స్‌ 4 పరుగులతో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ సామ్సన్‌ (63 బంతుల్లో 119; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) ఐపీఎల్‌ చరిత్రలో చిరస్మరణీయ సెంచరీ ఇన్నింగ్స్‌ ఆడాడు.

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (50 బంతుల్లో 91; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగగా... దీపక్‌ హుడా (28 బంతుల్లో 64; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) హైలైట్స్‌ చూపించాడు. చేతన్‌ సకారియా 3, క్రిస్‌ మోరిస్‌ 2 వికెట్లు తీశారు. తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసి ఓడిపోయింది.

రాహుల్‌-హూడా బ్యాటింగ్ దెబ్బకు రాజస్థాన్ ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను రంగంలోకి దించినా ఫలితం లేకపోయింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (14)ను మూడో ఓవర్‌లోనే పేసర్‌ సకారియా అవుట్‌ చేయగా బరిలోకి దిగిన గేల్‌ ఉన్నంత సేపు బ్యాట్‌ ఝుళిపించాడు. రాహుల్‌తో కలిసి ఓవర్‌కో బౌండరీ ఉండేలా వేగం కనబరిచాడు. అయితే తొమ్మిదో ఓవర్‌లో 4,6 బాదిన గేల్‌ను మరుసటి ఓవర్‌లోనే యువ స్పిన్నర్‌ రియాన్‌ పరాగ్‌ అవుట్‌ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు రాహుల్‌ మాత్రం ఓ సిక్సర్‌తో 30 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఇక దీపక్‌ హూడా భారీ షాట్లతో ఆర్‌ఆర్‌ బౌలర్లను వణికించాడు.

ఓటమితో ఐపీఎల్‌ని ప్రారంభించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన కోలకతా నైట్ రైడర్స్, 10 పరుగుల తేడాతో కేఆర్‌ ఘన విజయం

13వ ఓవర్‌లో రెండు, 14వ ఓవర్లలో మూడు సిక్సర్లు బాదడంతో పంజాబ్‌ స్కోరు 150కి చేరింది. ఇదే జోరుతో తను 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అలాగే 17వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లు సాధించిన హూడాను తర్వాతి ఓవర్‌లోనే మోరిస్‌ అవుట్‌ చేశాడు. మూడో వికెట్‌కు 47 బంతుల్లోనే 105 పరుగులు రావడం విశేషం. అదే ఓవర్‌లో పూరన్‌ (0) క్యాచ్‌ను ఎడమవైపు డైవ్‌ చేస్తూ సకారియా అద్భుతంగా పట్టేశాడు. అప్పటికే స్కోరు 200 దాటింది. ఇక చివరి ఓవర్‌లో రాహుల్‌ క్యాచ్‌ను బౌండరీ లైన్‌ దగ్గర సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ తెవాటియా పట్టేయడంతో అతడి సెంచరీ మిస్‌ అయ్యింది. కానీ పంజాబ్‌ చివరి 5 ఓవర్లలోనే 61 పరుగులు సాధించింది.

కొండంత లక్ష్యాన్ని చూసి రాజస్తాన్‌ రాయల్స్‌ జడిసిపోలేదు. హిట్టర్‌ స్టోక్స్‌ (0) తొలి ఓవర్లో డకౌటైనా కంగారు పడిపోలేదు.కెప్టెన్‌ సామ్సన్‌కు వచ్చిన రెండు లైఫ్‌లు లక్ష్యాన్ని దించేందుకు దోహదం చేశాయి. 12 పరుగుల వద్ద కీపర్‌ రాహుల్‌ సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తయ్యాక ఎల్బీగా వెనుదిరగాల్సిన సంజూ రివ్యూతో బతికిపోయాడు.

ధోనీ సేనకు ఆదిలోనే పరాజయం, ఢిల్లీకి తొలి గెలుపును అందించిన శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా, చెన్నైని గెలిపించలేకపోయిన రైనా ఇన్సింగ్స్

బట్లర్‌ (25; 5 ఫోర్లు), శివమ్‌ దూబే (23; 3 ఫోర్లు) వేగంగా ఆడినా... ఎక్కువసేపు నిలువలేదు. ఆ తర్వాత రియాన్‌ పరాగ్‌ (11 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్స్‌లు)తో కలిసి సామ్సన్‌ ప్రత్యర్థి బౌలర్లను చావబాదాడు. ఐదో వికెట్‌కు వీరిద్దరి మధ్య చకచకా సాగిన 52 పరుగుల భాగస్వామ్యం జట్టులో ఆశల్ని కసికసిగా పెంచింది. చివరకు సామ్సన్‌ 54 బంతుల్లోనే సాధించిన సెంచరీ గెలుపుదారిలో పడేసింది. కానీ ఆఖరి ఓవర్లో రాజస్తాన్‌ విజయానికి 13 పరుగులు అవసరమైన దశలో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. అర్‌‡్షదీప్‌ సింగ్‌ వేసిన ఈ ఓవర్లో తొలి బంతికి సామ్సన్‌కు పరుగు రాలేదు.

రెండో బంతికి సామ్సన్‌... మూడో బంతికి మోరిస్‌ సింగిల్స్‌ తీశారు. నాలుగో బంతిని సామ్సన్‌ సిక్సర్‌గా మలిచాడు. దాంతో రాజస్తాన్‌ గెలుపునకు 2 బంతుల్లో 5 పరుగులు అవరసమయ్యాయి. ఐదో బంతిని సామ్సన్‌ లాంగ్‌ఆఫ్‌ వద్దకు ఆడగా... మోరిస్‌ సింగిల్‌ కోసం వచ్చాడు. కానీ సామ్సన్‌ సింగిల్‌ వద్దనడంతో మోరిస్‌ వెనక్కి వెళ్లిపోయాడు. దాంతో చివరి బంతికి రాజస్తాన్‌ గెలుపునకు 5 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆరో బంతిని సామ్సన్‌ కవర్స్‌లో కొట్టిన భారీ షాట్‌ బౌండరీ దాటకుండా పంజాబ్‌ ఫీల్డర్‌ దీపక్‌ హుడా చేతికి చిక్కింది. దాంతో చేజారిందనుకున్న మ్యాచ్‌లో పంజాబ్‌ విజయాన్ని అందుకుంది.

స్కోరు వివరాలు

పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: కేఎల్‌ రాహుల్‌ (సి) తెవాటియా (బి) సకారియా 91; మయాంక్‌ (సి) సంజూ సామ్సన్‌ (బి) సకారియా 14; గేల్‌ (సి) స్టోక్స్‌ (బి) పరాగ్‌ 40; దీపక్‌ హుడా (సి) పరాగ్‌ (బి) మోరిస్‌ 64; పూరన్‌ (సి) సకారియా (బి) మోరిస్‌ 0; షారుఖ్‌ ఖాన్‌ (నాటౌట్‌) 6; జే రిచర్డ్‌సన్‌ (సి) మోరిస్‌ (బి) సకారియా 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 221.

వికెట్ల పతనం: 1–22, 2–89, 3–194, 4–201, 5–220, 6–221.

బౌలింగ్‌: చేతన్‌ సకారియా 4–0–31–3, ముస్తాఫిజుర్‌ 4–0–45–0, మోరిస్‌ 4–0–41–2, శ్రేయస్‌ గోపాల్‌ 3–0–40–0, స్టోక్స్‌ 1–0–12–0, తెవాటియా 2–0–25–0, రియాన్‌ పరాగ్‌ 1–0–7–1, దూబే 1–0–20–0.

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: స్టోక్స్‌ (సి అండ్‌ బి) షమీ 0; వొహ్రా (సి అండ్‌ బి) అర్‌దీప్‌ సింగ్‌ 12; సంజూ సామ్సన్‌ (సి) హుడా (బి) అర్‌‡్షదీప్‌ సింగ్‌ 119; బట్లర్‌ (బి) రిచర్డ్‌సన్‌ 25; శివమ్‌ దూబే (సి) హుడా (బి) అర్‌దీప్‌ సింగ్‌ 23, పరాగ్‌ (సి) రాహుల్‌ (బి) షమీ 25; తెవాటియా (సి) రాహుల్‌ (బి) మెరెడిత్‌ 2; మోరిస్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 217.

వికెట్ల పతనం: 1–0, 2–25, 3–70, 4–123, 5–175, 6–201, 7–217.

బౌలింగ్‌: షమీ 4–0–33–2, రిచర్డ్‌సన్‌ 4–0–55–1, అర్‌‡్షదీప్‌ సింగ్‌ 4–0–35–3, మెరెడిత్‌ 4–0–49–1, మురుగన్‌ అశ్విన్‌ 4–0–43–0.

ఐపీఎల్‌లో నేడు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ X ముంబై ఇండియన్స్‌

వేదిక: చెన్నై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం.