KKR (Photo Credits: Twitter/IPL)

ఐపీఎల్‌ తాజా సీజన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమితో ఆరంభించింది. ఐపీఎల్‌-2021లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌నే విజయం వరించింది. సన్‌రైజర్స్‌ (Sunrisers Hyderabad) కడవరకూ పోరాడినా ఓటమి పాలైంది.

కేకేఆర్‌ నిర్దేశించిన 189 పరుగుల టార్గెట్‌ ఛేదనలో (SRH vs KKR Stat Highlights IPL 2021) ఆరెంజ్‌ ఆర్మీ గెలుపు అంచుల వెళ్లి చతికిలబడింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ బృందం 10 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) చేతిలో ఓడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు సాధించింది. నితీశ్‌ రాణా (56 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), రాహుల్‌ త్రిపాఠి (29 బంతుల్లో 53; 5 ఫోర్లు 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు.

సన్‌రైజర్స్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్, నబీ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం హైదరాబాద్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసి పరాజయం పాలైంది. మనీశ్‌ పాండే (44 బంతుల్లో 61 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), బెయిర్‌స్టో (40 బంతుల్లో 55; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో పోరాడినా హైదరాబాద్‌ను విజయతీరానికి చేర్చలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ రెండు వికెట్లు తీయగా... కీలకమైన బెయిర్‌స్టో వికెట్‌ను కమిన్స్‌ దక్కించుకొని తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ధోనీ సేనకు ఆదిలోనే పరాజయం, ఢిల్లీకి తొలి గెలుపును అందించిన శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా, చెన్నైని గెలిపించలేకపోయిన రైనా ఇన్సింగ్స్

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా తొలి ఓవర్‌ నుంచే దూసుకెళ్లింది. ముఖ్యంగా ఓపెనర్‌ నితీశ్‌ రాణా కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో రైజర్స్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అతడికి రాహుల్‌ త్రిపాఠి జత కలవడంతో పరుగుల వరద పారింది. అయితే ఓ దశలో 200 స్కోరు సునాయాసంగా కనిపించినా చివరి 5 ఓవర్లలో రైజర్స్‌ బౌలర్లు ఆధిపత్యం చూపారు. ఇన్నింగ్స్‌ తొలి బంతినే ఫోర్‌గా మలిచిన రాణా క్రీజులో ఉన్నంత సేపు చెలరేగాడు. రషీద్‌ ఒక్కడే అతడి ధాటిని తట్టుకోగలిగాడు. దీంతో పవర్‌ప్లేలోనే జట్టు 50 పరుగులు సాధించింది.

త్రిపాఠి–రాణా జంట రెండో వికెట్‌కు 50 బంతుల్లో 93 పరుగులు జోడించింది. ఆ తర్వాత కూడా రాణా కొన్ని చూడచక్కని షాట్లు ఆడాడు. సెంచరీ వైపు దూసుకెళ్తున్న రాణాను నబీ పెవిలియన్‌కు చేర్చాడు. చివర్లో దినేశ్‌ కార్తిక్‌ (9 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా రసెల్‌ (5), కెప్టెన్‌ మోర్గాన్‌ (2), షకీబుల్‌ హసన్‌ (3) విఫలమయ్యారు. దాంతో కోల్‌కతా 41 పరుగుల వ్యవధిలో 5 వికెట్లను కోల్పోయి 200 మార్కును అందుకోలేకపోయింది.

భారీ లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌కు ఆరంభంలోనే దెబ్బ పడింది. హర్భజన్‌ వేసిన తొలి ఓవర్‌ నాలుగో బంతికి వార్నర్‌ ఇచ్చిన క్యాచ్‌ను కమిన్స్‌ జారవిడిచాడు. అయితే వార్నర్‌ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో ప్రసిధ్‌ కృష్ణ బౌలింగ్‌లో వార్నర్‌ (3) కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. సిక్స్‌ కొట్టి జోరు మీదున్నట్లు కనిపించిన మరో ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా (7) షకీబ్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. దాంతో హైదరాబాద్‌ 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో జతకట్టిన బెయిర్‌స్టో, మనీశ్‌ పాండేలు క్రీజులో కుదురుకున్నాక స్వేచ్ఛగా షాట్లు ఆడారు. ముఖ్యంగా బెయిర్‌స్టో సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. వరుణ్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ కొట్టిన బెయిర్‌స్టో 32 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అయితే 13వ ఓవర్‌ వేయడానికి వచ్చిన కమిన్స్‌ మ్యాచ్‌ గతిని మార్చేశాడు. ఆ ఓవర్‌ తొలి 5 బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే రావడంతో ఒత్తిడికి గురైన బెయిర్‌స్టో చివరి బంతిని బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లోకి ఆడగా... అక్కడే ఉన్న నితీశ్‌ రాణా ఒడిసి పట్టుకున్నాడు. దాంతో 92 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. పాండే అడపాదడపా షాట్లు ఆడుతూ 37 బంతుల్లో హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. నబీ (11 బంతుల్లో 14; 2 ఫోర్లు), విజయ్‌ శంకర్‌ (7 బంతుల్లో 11; సిక్స్‌) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు. చివర్లో అబ్దుల్‌ సమద్‌ (8 బంతుల్లో 19 నాటౌట్‌; 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. హైదరాబాద్‌ విజయానికి చివరి ఓవర్లో 22 పరుగులు అవసరం కాగా... రసెల్‌ వేసిన ఈ ఓవర్‌లో సమద్, పాండే భారీ షాట్‌లు ఆడలేకపోవడంతో హైదరాబాద్‌ 11 పరుగులే రాబట్టగలిగింది.

స్కోరు వివరాలు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: నితీశ్‌ రాణా (సి) శంకర్‌ (బి) నబీ 80; గిల్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 15; త్రిపాఠి (సి) సాహా (బి) నటరాజన్‌ 53; రసెల్‌ (సి) పాండే (బి) రషీద్‌ ఖాన్‌ 5; మోర్గాన్‌ (సి) సమద్‌ (బి) నబీ 2; దినేశ్‌ కార్తీక్‌ (నాటౌట్‌) 22; షకీబ్‌ (సి) సమద్‌ (బి) భువనేశ్వర్‌ 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 187.

వికెట్ల పతనం: 1–53, 2–146, 3–157, 4–160, 5–160, 6–187.

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–45–1, సందీప్‌ శర్మ 3–0–35–0, నటరాజన్‌ 4–0–37–1, నబీ 4–0–32–2, రషీద్‌ ఖాన్‌ 4–0–24–2, విజయ్‌ శంకర్‌ 1–0–14–0.

సన్‌రైజర్స్‌ హెదరాబాద్‌ ఇన్నింగ్స్‌: సాహా (బి) షకీబ్‌ 7; వార్నర్‌ (సి) దినేశ్‌ కార్తీక్‌ (బి) ప్రసిధ్‌ కృష్ణ 3; మనీశ్‌ పాండే (నాటౌట్‌) 61; బెయిర్‌స్టో (సి) నితీశ్‌ రాణా (బి) కమిన్స్‌ 55; నబీ (సి) మోర్గాన్‌ (బి) ప్రసిధ్‌ కృష్ణ 14; విజయ్‌ శంకర్‌ (సి) మోర్గాన్‌ (బి) రసెల్‌ 11; సమద్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 177.

వికెట్ల పతనం: 1–10, 2–10, 3–102, 4–131, 5–150.

బౌలింగ్‌: హర్భజన్‌ సింగ్‌ 1–0–8–0, ప్రసిధ్‌ కృష్ణ 4–0–35–2, షకీబ్‌ 4–0–34–1, కమిన్స్‌ 4–0–30–1, రసెల్‌ 3–0–32–1, వరుణ్‌ చక్రవర్తి 4–0–36–0.