Andhra Pradesh Weather Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీ తీర ప్రాంతాలకు భారీ వర్షాల అలర్ట్.. ఈ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక..
ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ (IMD), విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేశాయి.
Andhra Pradesh Weather Alert: ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ (IMD), విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేశాయి.
ఈ తీవ్ర వాయుగుండం కారణంగా బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అత్యధికంగా 7.2 సెంటీమీటర్ల (72.4 మి.మీ) వర్షం కురవగా, కృష్ణా జిల్లా కంకిపాడులో 6.7 సెంటీమీటర్లు, పెనమలూరులో 6.46 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. అదేవిధంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో 6.2, పి.గన్నవరంలో 5.8, ముమ్మడివరంలో 5 సెంటీమీటర్ల మేర వర్షం పడింది. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో 6 సెంటీమీటర్లు, భీమవరంలో 5.2 సెంటీమీటర్లు, ఏలూరు జిల్లా కలిదిండిలో 5.5, ముదినేపల్లిలో 5.2 సెంటీమీటర్ల చొప్పున వర్షం నమోదైంది.
తాజా వాతావరణ హెచ్చరికల ప్రకారం, ఈ వాయుగుండం ప్రభావంతో పోలవరం, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఇతర 13 జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. మార్కాపురం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడా చిరుజల్లులు పడవచ్చని అధికారులు తెలిపారు. కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున, ప్రజలు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాలు, తాత్కాలిక హోర్డింగ్‌ల సమీపంలో గానీ నిలబడవద్దని అధికారులు స్పష్టం చేశారు. సముద్రం కూడా ఉధృతంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.