Keesara Police Station Bribe Case: కీసర చెరువు వద్ద ACB ట్రాప్.. రూ.5 లక్షలు తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఎస్‌ఐ, సీఐ.. ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసి విచారిస్తున్న ఏసీబీ
తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు నిర్వహించిన ఆపరేషన్‌లో మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు దొరికిపోయారు
Keesara Police Station Bribe Case: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు నిర్వహించిన ఆపరేషన్‌లో మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు దొరికిపోయారు. స్టేషన్ బెయిల్ ఇప్పించడంతో పాటు బాధితుడిని వేధించకుండా ఉండేందుకు రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఇన్‌స్పెక్టర్/ఎస్‌హెచ్‌ఓ అర్కపల్లి ఆంజనేయులు, సబ్‌ఇన్‌స్పెక్టర్ ద్యాప జ్ఞానేందర్ రెడ్డిలపై ఏసీబీ కేసులు నమోదు చేసింది.
ఏసీబీ వివరాల ప్రకారం.. కీసర పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసులో ఫిర్యాదుదారుడు, అతని స్నేహితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చి.. ఇకపై ఎలాంటి వేధింపులకు గురిచేయకుండా ఉండేందుకు నిందితులు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు రంగంలోకి దిగి వల పన్నారు. సెప్టెంబర్ 16 రాత్రి 11.25 గంటల సమయంలో గణేష్ నిమజ్జనం విధుల్లో ఉన్న ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి, కీసర చెరువు సమీపంలో కారులో రూ.5 లక్షల నగదు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యకు కారణం అదేనా.. బాణాల రాంరెడ్డి సూ*సైడ్ వెనక ఏం జరిగింది..
ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు ఆదేశాల మేరకే ఎస్‌ఐ ఈ లంచం తీసుకున్నట్లు దర్యాప్తులో తేలడంతో ఇద్దరిపైనా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ ఘటన అనంతరం కీసర పోలీస్ స్టేషన్‌తో పాటు అధికారుల నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. నిందితులిద్దరినీ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే టోల్‌ఫ్రీ నంబర్ 1064 ద్వారా ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ ప్రజలకు సూచించింది.