Khammam Horror: రోడ్డుపై ముక్కూ, ముఖం తెలియని వారు లిఫ్ట్ అడగ్గానే.. ఇస్తున్నారా? అయితే, ఈ స్టోరీ మీకోసమే.. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఇంజక్షన్ తో పొడిచి చంపేశాడు! ఖమ్మంలో దారుణ ఘటన
బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగి.. ఎక్కిన తర్వాత వెనక నుంచి ఇంజక్షన్ గుచ్చి చంపేశాడో కిరాతకుడు. ఖమ్మం జిల్లాలో జరిగిందీ ఘటన.
Khammam, September 20: బైక్‌పై (Bike) వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగి.. ఎక్కిన తర్వాత వెనక నుంచి ఇంజక్షన్ గుచ్చి చంపేశాడో కిరాతకుడు. ఖమ్మం (Khammam) జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని చింతకాని మండలం బొప్పారానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ (48).. ఏపీలోని జగ్గయ్యపేట మండలం గండ్రాయిలో తన పెద్ద కుమార్తె వద్దనున్న భార్య ఇమాంబీని తీసుకొచ్చేందుకు నిన్న ఉదయం బైక్‌పై బయలుదేరాడు. ముదిగొండ మండలంలోని వల్లభి సమీపంలో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై నిలబడి లిఫ్ట్ (Lift) అడిగారు. తమ బైక్‌లో పెట్రోలు అయిపోయిందని, తమలో ఒకరికి లిఫ్ట్ ఇస్తే పెట్రోలు (Petrol) తెచ్చుకుంటామని చెప్పడంతో జమాల్ సరేనని ఎక్కించుకున్నాడు. కొంతదూరం వెళ్లాక బైక్ ఎక్కిన వ్యక్తి జమాల్ వీపుపై ఇంజక్షన్‌తో పొడిచాడు.
ఆ వెంటనే.. బైక్ దూకి వెనకే వస్తున్న మరో నిందితుడి బైక్ ఎక్కి పరారయ్యాడు. మరోవైపు, ఇంజక్షన్ ప్రభావంతో కళ్లు బైర్లు కమ్ముతుండడంతో.. తాను లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి వెనక నుంచి ఏదో గుచ్చి పారిపోయాడని స్థానికులకు చెప్పి సాహెబ్ పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతడిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, జమాల్ కంటే ముందు నిందితులు మైసయ్య అనే వ్యక్తిని లిఫ్ట్ అడిగారు. అతడు ఇవ్వకుండా వెళ్లిపోవడంతో బతికిపోయాడు. లేదంటే ఇంజక్షన్ అతడిపైనే ప్రయోగించి ఉండేవారని పోలీసులు అనుమానిస్తున్నారు. పిచ్చికుక్కలను చంపేందుకు వాడే రసాయనాన్ని ఇంజక్షన్‌లో ఎక్కించినట్టు గుర్తించారు.
(The above story first appeared on LatestLY on Sep 20, 2022 12:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

