N Chandrasekaran: టాటా సన్స్ బోర్డు కీలక నిర్ణయం..మరో 5 ఏళ్ల పాటు చంద్రశేఖరన్ కొనసాగింపునకు గ్రీన్ సిగ్నల్..
టాటా గ్రూప్ భవిష్యత్తు నాయకత్వంపై గత కొంతకాలంగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ సంస్థ పాలక మండలి (బోర్డు) కీలక నిర్ణయం తీసుకుంది.
N Chandrasekaran: టాటా గ్రూప్ భవిష్యత్తు నాయకత్వంపై గత కొంతకాలంగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ సంస్థ పాలక మండలి (బోర్డు) కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఆర్‌బీఐ నిబంధనలకు లోబడి కంపెనీని స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేసేందుకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది. అయితే, టాటా గ్రూప్‌లోని అత్యున్నత నిర్ణయాత్మక విభాగంలో ఈ ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎన్‌డీటీవీ ప్రాఫిట్ కథనం ప్రకారం.. చంద్రశేఖరన్ కొనసాగింపుతో పాటు టాటా సన్స్ లిస్టింగ్ ప్రతిపాదనలను టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా తీవ్రంగా వ్యతిరేకించారు. బోర్డులో తనకున్న ప్రత్యేక ‘వీటో’ అధికారాన్ని ఉపయోగించి ఈ రెండు తీర్మానాలను అడ్డుకునేందుకు ఆయన ప్రయత్నించినట్లు సమాచారం. అయితే, బోర్డులోని మెజారిటీ సభ్యులు చంద్రశేఖరన్ నాయకత్వానికి, లిస్టింగ్‌కే జై కొట్టడంతో ఈ తీర్మానాలు ఆమోదం పొందాయి.
ఇవాళే మీ లాస్ట్ వర్కింగ్ డే అంటూ ఒరాకిల్ ఉద్యోగులకు షాక్.. ఉదయం 6 గంటలకే కంపెనీ నుంచి ఈమెయిల్..
టాటా గ్రూప్‌లోని ప్రధాన వ్యాపారాల మూలధన కేటాయింపులు, కొన్ని భాగస్వామ్య సంస్థల పనితీరుపై నోయెల్ టాటా ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారీ వ్యయంతో కూడుకున్న ఎయిరిండియా (Air India) పునర్నిర్మాణం, డిజిటల్ విభాగమైన టాటా డిజిటల్ (Tata Digital) ఆశించిన రీతిలో ఫలితాలు ఇవ్వకపోవడంపై బోర్డు సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2022లో టాటా సన్స్‌ను ‘అప్పర్ లేయర్’ ఎన్‌బీఎఫ్‌సీ (NBFC)గా వర్గీకరించింది. ఈ కేటగిరీ కింద ఉన్న కంపెనీలు మూడేళ్ల వ్యవధిలో అంటే మార్కెట్‌లో తప్పనిసరిగా లిస్ట్ కావాల్సి ఉంది. ఆర్‌బీఐ నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలోనే టాటా సన్స్ ఐపీఓ (IPO) దిశగా అడుగులు వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
చంద్రశేఖరన్ ప్రస్థానం: 2017 ఫిబ్రవరిలో టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖరన్‌కు 2022లో రెండోసారి పదవీకాలం పొడిగించారు. ఆ గడువు 2027 ఫిబ్రవరి వరకు ఉంది. అయితే, ఈ ఏడాది ఆగస్టులోనే తాను తదుపరి పదవీకాలాన్ని పొడిగించుకోవడానికి ఆసక్తిగా లేనని బోర్డుకు తెలిపినప్పటికీ, గ్రూప్ స్థిరత్వం దృష్ట్యా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
ఏజీఎం వాయిదా ఘటన: ఇటీవల ఆగస్టులో జరగాల్సిన టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) కోరం (కనీస సభ్యుల హాజరు) లేకపోవడంతో అనూహ్యంగా వాయిదా పడింది. టాటా సన్స్ సుదీర్ఘ చరిత్రలోనే ఒక ఏజీఎం ఇలా వాయిదా పడటం ఇదే తొలిసారి. సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు సంబంధించిన కొన్ని అంతర్గత పరిమితులే ఈ పరిణామానికి కారణమని తెలుస్తోంది.
ఏది ఏమైనప్పటికీ, దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజమైన టాటా గ్రూప్‌లో చోటుచేసుకుంటున్న ఈ వరుస పరిణామాలు, చంద్రశేఖరన్ నాయకత్వంలో కంపెనీ రాబోయే ఐదేళ్లలో ఐపీఓ వైపు సాగించే ప్రయాణం భారత స్టాక్ మార్కెట్‌లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనుంది.