Long March 5B Rocket: ప్రపంచానికి తప్పిన పెను ముప్పు, హిందూ మహా సముద్రంలో కూలిన చైనా రాకెట్, భూవాతావరణంలోకి రాగానే మండిపోయిన రాకెట్ శకలాలు

ప్రపంచానికి పెద్ద ముప్పు త‌ప్పింది.. నియంత్రణ కోల్పోయి భూమిపైకి శరవేగంగా దూసుకొచ్చిన‌ చైనా రాకెట్ శకలాలు (Long March 5B Rocket) చివ‌ర‌కు హిందూ మ‌హా స‌ముద్రంలో ప‌డ్డాయి. భూవాతావ‌ర‌ణంలోకి చేర‌గానే అవి మండిపోయిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు.

Long March 5B Rocket: ప్రపంచానికి తప్పిన పెను ముప్పు, హిందూ మహా సముద్రంలో కూలిన చైనా రాకెట్, భూవాతావరణంలోకి రాగానే మండిపోయిన రాకెట్ శకలాలు
Representational Image (Photo Credits: Pexels)

Beijing, May 9: ప్రపంచానికి పెద్ద ముప్పు త‌ప్పింది.. నియంత్రణ కోల్పోయి భూమిపైకి శరవేగంగా దూసుకొచ్చిన‌ చైనా రాకెట్ శకలాలు (Long March 5B Rocket) చివ‌ర‌కు హిందూ మ‌హా స‌ముద్రంలో ప‌డ్డాయి. భూవాతావ‌ర‌ణంలోకి చేర‌గానే అవి మండిపోయిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. చైనా సొంతంగా నిర్మించుకుంటున్న అంతరిక్ష కేంద్రానికి ఏప్రిల్‌ 29న కోర్ మాడ్యూల్ మోసుకెళ్లిన ‘లాంగ్ మార్చ్5బి’ రాకెట్ (China's Long March 5B Rocket) అనంత‌రం నియంత్రణ కోల్పోయిన విష‌యం తెలిసిందే.

దీంతో ఆ రాకెట్ శ‌క‌లాలు ఎక్కడ పడతాయో తెలియక ప్రపంచం మొత్తం ఆందోళన చెందింది. చివ‌ర‌కు భూవాతావరణంలోకి రాగానే రాకెట్ శ‌క‌లాలు మండిపోయాయి. భూమి వాతావరణంలోకి లాంగ్ మార్చ్ 5బీ ప్రవేశించడంతో దాని భాగాల్లో చాలా వరకు అంతకుముందే ధ్వంసమైపోయాయి. ఈ రోజు హిందూ మ‌హా స‌ముద్రంలో ప‌డ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, రాకెట్ శ‌క‌లాలు భూ వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోతాయ‌ని ఇప్ప‌టికే చైనా కూడా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. రాకెట్ శకలాలు ఎక్కడ ప‌డ‌తాయ‌న్న విష‌యంపై శాస్త్ర‌వేత్త‌లు కొన్ని రోజులుగా దృష్టిసారించారు.

లాంగ్ మార్చ్ 5బీకి సంబంధించిన సమాచారాన్ని చైనా మాన్‌డ్ స్పేస్ ఇంజినీరింగ్ ఆఫీస్ వెల్లడించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ వివరాల ప్రకారం, ఈ రాకెట్ బీజింగ్ కాలమానం ప్రకారం ఉదయం 10.24 గంటలకు (02.24 గంటలు జీఎంటీకి) భూమి వాతావరణంలోకి ప్రవేశించింది. 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం, 2.65 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద దీని శిథిలాలు పడ్డాయి. అంటే మాల్దీవుల సమూహానికి పశ్చిమ దిశలో మహా సముద్రంపై ఇది పడింది. అత్యధిక శిథిలాలు వాతావరణంలోనే కాలిపోయాయి.

ప్రపంచానికి మరో ముప్పును తెచ్చి పెట్టిన చైనా, భూమి వైపు దూసుకొస్తున్న లాంగ్‌ మార్చ్‌ 5బి రాకెట్, ప్రమాదమేమి లేదని చెబుతున్న డ్రాగన్ కంట్రీ

చైనీస్ స్పేస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం, 18 టన్నుల బరువుగల ఈ రాకెట్ విడి భాగం ఎక్కడ పడుతుందోననే ఉత్కంఠకు తెరపడింది. దీని వల్ల నష్టం పెద్దగా ఉండబోదని చైనా అధికారులు చెప్తున్నారు. లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ చైనాకు చెందిన కొత్త స్పేస్ స్టేషన్‌ను భూ కక్ష్యలోకి ఏప్రిల్ 29న ప్రయోగించింది. ఇది బీజింగ్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 10.24 గంటలకు మాల్దీవులకు సమీపంలోని హిందూ మహా సముద్రంలో పడిందని చైనా మాన్‌డ్ స్పేస్ ఇంజినీరింగ్ ఆఫీస్ తెలిపింది.

లాంగ్ మార్చ్ తొలి ప్రయాణం 2020 మేలో జరిగింది. ప్రస్తుతం పేలిపోయిన రాకెట్ 5బీ రకాల్లో రెండోది. గత ఏడాది మొదటి లాంగ్ మార్చ్ 5బీ శిథిలాలు ఐవరీ కోస్ట్‌లో పడ్డాయి. వీటి వల్ల కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. ఇదిలావుండగా, అమెరికా మిలిటరీ డేటాను ఉపయోగించే స్పేస్ ట్రాక్ అనే మానిటరింగ్ సర్వీస్ కూడా ఈ లాంగ్ మార్చ్ 5బీ భూమిపైకి వచ్చినట్లు, హిందూ మహా సముద్రంలో పడినట్లు ధ్రువీకరించింది.అయితే అధికారిక సమాచారం కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొంది.

(The above story first appeared on LatestLY on May 09, 2021 11:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).