Iran-Pakistan Conflict (Photo-PTI)

Tehran, Jan 29: దాయాది దేశం పాకిస్తాన్-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ ఉదిక్ర్తతల నడుమ పాకిస్థాన్‌కు చెందిన 9 మంది కార్మికులు ఇరాన్‌లో దారుణ హత్యకు గురయ్యారు. దీంతో ఈ వివాదం మరింతగా రాజుకుంది. పాకిస్థాన్‌తో సరిహద్దు పంచుకుంటున్న ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో శనివారం గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి వీరిని కాల్చి చంపారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. దీనిపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని, ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పాక్ విదేశాంగశాఖ డిమాండ్ చేసింది. ఈ ఘటనకు ఏ గ్రూపు ఇప్పటి వరకు బాధ్యత ప్రకటించలేదు.ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ చర్చల కోసం పాకిస్థాన్‌లో పర్యటించడానికి ఒకరోజు ముందు ఈ ఘటన జరగడం గమనార్హం. ఇరు దేశాల మధ్య సోదర సంబంధాన్ని దెబ్బతీసేందుకు విధ్వంసకర శక్తులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని ఇరాన్ స్పష్టం చేసింది.

ఇరాన్ పై పాకిస్థాన్ వైమానిక దాడులు, ఉగ్ర‌వాదుల స్థావ‌రాలే ల‌క్ష్యంగా ఎయిర్ స్ట్రైక్స్

ఈ నెల 16న బలూచిస్థాన్ ప్రావిన్సులోని జైషే మహ్మద్, అల్ అదిల్ ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ క్షిపణి దాడులకు దిగింది. ఇది పాక్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. ఇరాన్ దాడిలో ఇద్దరు చిన్నారులు మరణించారని పేర్కొన్న పాకిస్థాన్.. 18న ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 9 మంది మరణించారు. ఈ ఘటనలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ తాజా ఘటన మరింతగా అగ్గిరాజేసింది.