US Bill Could Halt H-1B Visas For 3 Years: అమెరికాలో కొత్త బిల్లు.. హెచ్-1బీ వీసాలకు 3 ఏళ్ల బ్రేక్? భారతీయుల్లో ఆందోళన..
అమెరికాలో పని చేయాలని లేదా స్థిరపడాలని భావిస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులకు ఆందోళన కలిగించే దిశగా యూఎస్ సెనేట్‌లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్-1బి (H-1B) వీసా ప్రక్రియలో మార్పులు ప్రతిపాదిస్తూ మోంటానాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ టిమ్ షీహీ.. ఎండ్ హెచ్-1బి అబ్యూస్ యాక్ట్' (End H-1B Abuse Act) పేరుతో ఒక బిల్లును ప్రవేశపెట్టారు.
US Bill Could Halt H-1B Visas For 3 Years: అమెరికాలో పని చేయాలని లేదా స్థిరపడాలని భావిస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులకు ఆందోళన కలిగించే దిశగా యూఎస్ సెనేట్‌లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్-1బి (H-1B) వీసా ప్రక్రియలో మార్పులు ప్రతిపాదిస్తూ మోంటానాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ టిమ్ షీహీ.. ఎండ్ హెచ్-1బి అబ్యూస్ యాక్ట్' (End H-1B Abuse Act) పేరుతో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికన్ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటం.. తక్కువ వేతనాల విదేశీ కార్మికులతో స్థానిక ఉద్యోగాలను భర్తీ చేయడాన్ని అడ్డుకోవడం, వీసా మోసాలను అరికట్టడమే ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదిత చట్టంలో పొందుపరిచిన అంశాలు ఆమోదం పొందితే H-1B వీసా వ్యవస్థ స్వరూపమే మారిపోతుంది. అందులో ముఖ్యమైనవి:
కొత్త వీసాలపై మూడేళ్ల నిషేధం: అన్ని రకాల కొత్త H-1B వీసాల జారీని మూడేళ్ల పాటు పూర్తిగా నిలిపివేయడం.
భారీ పిటిషన్ రుసుము: ప్రతి H-1B పిటిషన్‌పై ఏకంగా 1,00,000 డాలర్ల (సుమారు రూ. 96 లక్షలు) రుసుమును విధిస్తూ కాంగ్రెస్ ద్వారా చట్టబద్ధత కల్పించడం.
ఎంపిక విధానంలో మార్పు: ప్రస్తుత లాటరీ విధానాన్ని రద్దు చేసి, అత్యధిక వేతనాలు ఇచ్చే ఉద్యోగాలకే ప్రాధాన్యత ఇచ్చే వేతన ఆధారిత విధానాన్ని తీసుకురావడం.
నిషేధాలు & ఆంక్షలు: ఒకేసారి పలు యజమానుల వద్ద పనిచేసే విధానాన్ని, థర్డ్-పార్టీ స్టాఫింగ్ ఏజెన్సీల ప్రాసెస్ ప్రక్రియను పూర్తిగా నిషేధించడం.
గ్రీన్ కార్డ్, డిపెండెంట్ దారులకు కోత: H-1B హోల్డర్లు గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తూనే యూఎస్‌లో పనిచేసే 'డ్యూయల్ ఇంటెంట్' నిబంధనను రద్దు చేయడం మరియు వీసాదారులు తమ కుటుంబ సభ్యులను (డిపెండెంట్లు) అమెరికాకు తీసుకురాకుండా నిరోధించడం.
OPT రద్దు: అంతర్జాతీయ విద్యార్థులకు చదువు పూర్తయ్యాక లభించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) వంటి వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్‌లను రద్దు చేయడం.
ఏటా హెచ్-1బి వీసాలలో సింహభాగం పొందుతున్న భారతీయ నిపుణులు, గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో స్థిరపడాలని చూస్తున్న భారతీయ విద్యార్థులపై ఈ ప్రతిపాదనలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇది ప్రస్తుతానికి సెనేట్‌లో ప్రవేశపెట్టిన ఒక బిల్లు మాత్రమే. ఇది చట్టంగా మారడానికి ప్రతినిధుల సభ, సెనేట్ ఆమోదం పొంది, అధ్యక్షుడి సంతకం కావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి H-1B నిబంధనల్లో ఎలాంటి తక్షణ మార్పులు అమలులోకి రాలేదని.. దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.