US Suspends Green Card Filings: అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులకు షాక్.. అమెరికా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ నిలిపివేత..

అక్టోబర్ 8, 2026న అమెరికా కార్మిక శాఖ Cognizant, Infosys, TCS, Wipro, HCL, Capgemini, Microsoft, Adobe సంస్థలకు సంబంధించిన PERM లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తులపై నిలిపివేత ప్రకటించింది. అమెరికా ఉద్యోగుల అవకాశాలను విదేశీ ఉద్యోగుల నియామకాలు ప్రభావితం చేస్తున్నాయని, మోసాలు జరిగి ఉండవచ్చని అధికారులు ఆరోపించారు. ఈ ఆరోపణలు దర్యాప్తులో ఉన్నాయని గమనించాలి

US Suspends Green Card Filings: అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులకు షాక్.. అమెరికా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ నిలిపివేత..
US green Card.jpg

US Suspends Green Card Filings: అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణులకు, దిగ్గజ టెక్ సంస్థలకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కోలుకోలేని సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. హెచ్-1బి (H-1B) వీసాదారులకు శాశ్వత నివాస హోదా అయిన గ్రీన్ కార్డ్ (Green Card) పొందే ప్రక్రియలో అత్యంత కీలకమైన 'ప్రాగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్‌మెంట్' (PERM) లేబర్ సర్టిఫికేషన్ కార్యక్రమం నుంచి భారతదేశపు అగ్రగామి ఐటీ కంపెనీలతో పాటు అమెరికాకు చెందిన పలు గ్లోబల్ టెక్ దిగ్గజాలను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వైట్ హౌస్ ప్రాంగణంలోని ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ సమక్షంలో కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోండర్లింగ్ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.  గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు బిగ్ అలర్ట్.. సెప్టెంబర్ 18 నుంచి కొత్త నిబంధనలు.. ఇండియన్లపై ఎలాంటి ప్రభావం పడుతుంది..

ఈ సస్పెన్షన్ పరిధిలోకి ప్రముఖ భారతీయ ఐటీ సేవలు, అవుట్‌సోర్సింగ్ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్ (HCL), కాగ్నిజెంట్, క్యాప్‌జెమినిలతో పాటు మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి దిగ్గజ కంపెనీలు వచ్చాయి. ఇకపై ఈ సంస్థల నుంచి ఎలాంటి నూతన PERM లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తులను స్వీకరించబోమని, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను కూడా తక్షణమే నిలిపివేస్తున్నామని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. 2009 నుండి కేవలం ఈ నివేదిత కంపెనీలే దాదాపు 30 లక్షల మంది విదేశీ ఉద్యోగుల కోసం విన్నవించాయని, అందులో 2,30,000 కంటే ఎక్కువ H-1B వీసాలు , 1,00,000 పైగా PERM సర్టిఫికేషన్లను పొందాయని వెల్లడించింది. మోసపూరిత దరఖాస్తులను అరికట్టడం, అమెరికన్ కార్మికుల వేతనాలు తగ్గకుండా చూడటం , స్థానిక ఉద్యోగావకాశాలను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు సమర్థించుకుంది.

అమెరికా ప్రభుత్వ తాజా నిర్ణయం అక్కడ నివసిస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులపై , వారి కుటుంబాలపై అత్యంత తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. ఉపాధి ఆధారిత (Employment-Based) గ్రీన్ కార్డ్ ప్రక్రియను ప్రారంభించడానికి PERM సర్టిఫికేషన్ మొదటి , ప్రాథమిక అడుగు. ఈ లేబర్ సర్టిఫికేషన్ ఫైల్ చేసిన తేదీనే అభ్యర్థి 'ప్రాధాన్యత తేదీ' (Priority Date) గా పరిగణిస్తారు. సస్పెన్షన్ అమలుతో ప్రభావిత కంపెనీల ఉద్యోగులకు కొత్తగా PERM ఫైలింగ్ చేసుకునే అవకాశం లేక గ్రీన్ కార్డ్ ప్రక్రియ నిలిచిపోయి అనంతమైన ఆలస్యం జరగనుంది. ఇప్పటికే సెప్టెంబర్ 2026 వీసా బులెటిన్ ప్రకారం భారతీయులకు EB-2 కేటగిరీ లభ్యతలో లేకపోగా, EB-3 ప్రాధాన్యత తేదీ జనవరి 1, 2014 గానే కొనసాగుతోంది.

మరోవైపు, H-1B వీసాపై గరిష్టంగా ఆరు సంవత్సరాల పరిమితికి చేరువవుతున్న వేలాది మంది ఐటీ నిపుణుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నిబంధనల ప్రకారం 6 ఏళ్ల కాలపరిమితి దాటి అమెరికాలో కొనసాగాలంటే తగినంత ముందుగానే PERM ప్రక్రియ పూర్తయి ఉండాలి. ప్రస్తుతం ఆ ప్రక్రియలన్నీ నిలిచిపోవడంతో 6 ఏళ్లు పూర్తయ్యే ఉద్యోగులు అమెరికాను వదిలి స్వదేశానికి తిరిగి రాక తప్పని పరిస్థితులు ఎదురుకావచ్చు. అయితే ఇప్పటికే PERM ఆమోదం పొంది, గ్రీన్ కార్డ్ నంబర్ లభ్యం కాక వేచి చూస్తున్న ఉద్యోగులకు మాత్రం నిబంధనల ప్రకారం 3 సంవత్సరాల వరకు H-1B పొడిగింపులు (Extensions) పొందే వెసులుబాటు ఉంటుంది. అమెరికన్ కార్మికుల ప్రయోజనాలే పరమావధిగా ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం అంతర్జాతీయ ఐటీ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

(The above story first appeared on LatestLY on Oct 09, 2026 02:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).