New UPI Transaction Rules: కొత్త UPI ట్రాన్సాక్షన్ రూల్స్.. రూ.2,000 దాటితే ఛార్జీలు ఎలా ఉంటాయి.. పూర్తి వివరాలు ఇవిగో..
దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మరియు దాని సుస్థిరతను దెబ్బతినకుండా చూసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.
New UPI Transaction Rules: దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మరియు దాని సుస్థిరతను దెబ్బతినకుండా చూసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన పర్సన్-టు-మర్చంట్ (P2M) యూపీఐ లావాదేవీలపై విధించే మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)కు సంబంధించి ఎదురవుతున్న సందేహాలపై క్లారిటీ ఇస్తూ సమగ్ర వివరణతో కూడిన జాబితాను సోమవారం అధికారికంగా ప్రచురించింది. ఖరారు చేసిన ఈ నూతన ఎండీఆర్ ఫ్రేమ్‌వర్క్ 2026 అక్టోబర్ 15వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది.
యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపే సాధారణ వినియోగదారులకు ఈ నిర్ణయం వల్ల ఎలాంటి అదనపు భారం పడదని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. వ్యక్తుల మధ్య జరిగే (P2P) లావాదేవీలు, స్వయంచాలక పునరావృత చెల్లింపులు (Auto-pay), దుకాణాలలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చేసే చెల్లింపులు వినియోగదారులకు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని వెల్లడించింది. వినియోగదారుల నుంచి ఎలాంటి ప్లాట్‌ఫారమ్ రుసుములు లేదా దాగి ఉన్న ఛార్జీలు వసూలు చేయకూడదని యాప్ ప్రొవైడర్లను ఆదేశించింది. అంతేకాకుండా, నెలకు రూ. 1 లక్ష వరకు యూపీఐ ద్వారా స్వీకరించే సూక్ష్మ, వీధి వ్యాపారులను (P2PM) కూడా జీరో-ఎండీఆర్ పరిధిలోనే ఉంచారు.
మరోవైపు పెద్ద వ్యాపారులు చేసే రూ. 2,000 పైబడిన లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ విధించబడుతుంది. అయితే వ్యాపారులకు ఊరట కలిగిస్తూ రూ. 75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువగల చెల్లింపులపై ఎండీఆర్‌ను గరిష్ఠంగా రూ. 300 వద్ద పరిమితం (Cap) చేశారు. రైల్వేలు, టెలికాం, భీమా, పెట్రోల్ పంపులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ యుటిలిటీ బిల్లులకు రూ. 2,000 దాటిన లావాదేవీలకు శాతంతో సంబంధం లేకుండా కేవలం రూ. 5 ఫ్లాట్ రేటు మాత్రమే వర్తిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీలు, స్టాక్ బ్రోకర్లకు చేసే చెల్లింపులకు ఎండీఆర్ 0.02 శాతంగా నిర్ణయించారు.
యూపీఐ ప్రతి నెలా బిలియన్ల కొద్దీ లావాదేవీలను ప్రాసెస్ చేస్తున్నందున, సైబర్ సెక్యూరిటీ, సర్వర్ మౌలిక వసతులు మరియు ఆవిష్కరణలలో పెట్టుబడులు పెట్టడానికి ఈ రుసుము ఉపకరిస్తుందని ఎన్‌పీసీఐ వివరించింది. ఈ ఛార్జీల ద్వారా వచ్చే నిధులతో టైర్-3 నుంచి టైర్-6 నగరాలు, గ్రామీణ ప్రాంతాలు మరియు ఈశాన్య రాష్ట్రాల్లో డిజిటల్ చెల్లింపుల విస్తరణకు ఒక ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేయనున్నారు. 2026 నాటికి 11 విదేశాల్లో యూపీఐ సేవలు విస్తరించిన తరుణంలో, ఈ స్వయం సమృద్ధి నమూనా భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరిన్ని ఎత్తుకు తీసుకెళ్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.