Article 370 Verdict: ఆర్టికల్‌ 370 అంశంపై మూడు తీర్పులను వెలువరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, 2024 సెప్టెంబరు 30వ తేదీలోగా జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరపాలని ఆదేశం

జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ‘ఆర్టికల్‌ 370 (Article 370)’ రద్దు రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం కీలక తీర్పు (Article 370 Verdict)వెలువరించింది.

Supreme Court. (Photo Credits: Wikimedia Commons

SC on Article 370 Verdict: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ‘ఆర్టికల్‌ 370 (Article 370)’ రద్దు రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం కీలక తీర్పు (Article 370 Verdict)వెలువరించింది. ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ అంశంపై పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన రాజ్యాంగ ధర్మాసనం.. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ 2019వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు గతంలో విచారణ జరిపింది. ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సుదీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబరు 5న తన తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా సోమవారం ఆ తీర్పును వెలువరించింది.

కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేం, ఆర్టికల్ 370పై కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు, జమ్మూ కాశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం

ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకున్న నిర్ణయం అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అలాగే పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టిపారేయలేం అని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బెంచ్ తీర్పు నిచ్చింది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

జమ్మూ కశ్మర్ భారతదేశంలో చేరినప్పుడు సార్వభౌమాధికారం లేదని, కేంద్రం తీసుకునే ప్రతి చర్యనూ సవాలు చేయకూడదని సీజేఐ పేర్కొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లు తీర్పు వెలువరించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి కేంద్రానికి రాష్ట్రం అనుమతి అవసరం లేదని సీజేఐ పేర్కొన్నారు.

జమ్మూ & కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించడంపై కీలక వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి అమిత్ షా, 1950 నుండి అది మా ఎజెండాలో ఉందని వెల్లడి

అప్పట్లో యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఆర్టికల్‌ 370ని ప్రవేశపెట్టారు. అది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే గానీ.. శాశ్వతం కాదు. దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. హక్కుల విషయంలో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకత ఏమీ లేదు. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో అది సమానమే. ఆర్టికల్ 1, ఆర్టికల్‌ 370 ప్రకారం జమ్మూకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమే’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ తీర్పును వెలువరించారు.

జమ్మూకశ్మీర్‌ నుంచి లద్దాఖ్‌ను విభజించి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే, ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రహోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2024 సెప్టెంబరు 30వ తేదీలోగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

ఆర్టికల్‌ 370 రద్దు అంశంపై రాజ్యాంగ ధర్మాసనం మొత్తం మూడు తీర్పులు వెలువరించింది. సీజేఐ చంద్రచూడ్‌, జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌ కలిసి ఒక తీర్పు వెలువరించగా.. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా మరో రెండు తీర్పులను వెల్లడించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ కౌల్‌ తన తీర్పును వెలువరిస్తూ.. జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకున్న మానవహక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు జరగాలని అన్నారు. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. 1980 నుంచి జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలు, హింసాత్మక ఘటనలపై ఈ కమిషన్‌ దర్యాప్తు చేపట్టాలని పేర్కొన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement