Brij Bhushan Acquitted: మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్‌కు ఊరట.. నిర్దోషిగా విడుదల చేసిన ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు

దిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఆయనపై నమోదైన ఆరోపణలను రుజువు చేసేంత బలమైన ఆధారాలు లేవని పేర్కొంటూ నిర్దోషిగా విడుదల చేసింది. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌ను కూడా కోర్టు విముక్తి కల్పించింది.

Former WFI Chief Brij Bhushan Sharan Singh (Photo Credit: ANI)

Brij Bhushan Acquitted: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. దిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఆయనపై నమోదైన ఆరోపణలను రుజువు చేసేంత బలమైన ఆధారాలు లేవని పేర్కొంటూ నిర్దోషిగా విడుదల చేసింది. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌ను కూడా కోర్టు విముక్తి కల్పించింది.

విచారణ సందర్భంగా బాధిత మహిళా రెజ్లర్లు ఇచ్చిన వాంగ్మూలాల్లో పలు వ్యత్యాసాలు ఉన్నాయని, అభియోగాలను సందేహాతీతంగా నిరూపించే ప్రత్యక్ష లేదా బలమైన సాక్ష్యాలు సమర్పించలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది. క్రిమినల్ కేసులో శిక్ష విధించాలంటే ఆరోపణలు స్పష్టమైన ఆధారాలతో రుజువుకావాల్సి ఉంటుందని పేర్కొంటూ ఇద్దరు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.

బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితాలు.. ఆధిక్యంలో దూసుకుపోతున్న ప్రశాంత్ కిషోర్.. బిజేపీ శ్రేణుల్లో మొదలైన టెన్సన్..

ఈ కేసు 2023లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఒలింపిక్ పతక విజేతలు వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా తదితర ప్రముఖ రెజ్లర్లు.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీర్ఘకాలం నిరసనలు చేపట్టి, బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నిరసనలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీయగా, సుప్రీంకోర్టు జోక్యం అనంతరం దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విచారణలో భాగంగా ఒక మైనర్ రెజ్లర్ చేసిన ఫిర్యాదు తర్వాత ఉపసంహరించుకోవడంతో పోక్సో (POCSO) చట్టం కింద నమోదైన కేసు ఇప్పటికే రద్దయింది. అనంతరం మిగిలిన ఆరుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదులపై మాత్రమే విచారణ కొనసాగింది. ఇప్పుడు రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఈ కేసులో ప్రధాన క్రిమినల్ విచారణకు ముగింపు పలికినట్లైంది.

తీర్పు అనంతరం స్పందించిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, తనపై వచ్చిన ఆరోపణలు నిజమైతే తాను శిక్షకు సిద్ధమేనని మొదటి నుంచే చెప్పానని, చివరకు న్యాయం గెలిచిందని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ తీర్పుపై బాధితుల తరఫు న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఈ తీర్పు దేశంలో మహిళల భద్రత, క్రీడా సంఘాల పాలన, లైంగిక వేధింపుల ఆరోపణల విచారణ వంటి అంశాలపై మరోసారి చర్చకు తెరలేపింది. న్యాయపరమైన ప్రక్రియలో ఆరోపణలు మాత్రమే కాకుండా వాటిని బలమైన సాక్ష్యాలతో నిరూపించడం ఎంత కీలకమో ఈ కేసు మరోసారి స్పష్టం చేసింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement