Delhi-NCR Crimes: అత్యాచారం చేయాలనే ఆలోచన వస్తేనే వణుకు పుట్టాలి.. క్రిమినల్స్ గుండెల్లో భయం పుట్టించాలి.. అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
Delhi-NCR Crimes: దేశ రాజధాని దిల్లీ , ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న దారుణ అత్యాచార ఘటనలపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై జరుగుతున్న లైంగిక నేరాల కట్టడికి ప్రభుత్వం, పోలీసులు తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Delhi-NCR Crimes: దేశ రాజధాని దిల్లీ , ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న దారుణ అత్యాచార ఘటనలపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై జరుగుతున్న లైంగిక నేరాల కట్టడికి ప్రభుత్వం, పోలీసులు తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మహిళలపై అఘాయిత్యాలకు ఒడిగట్టే నేరస్థుల గుండెల్లో చట్టం అంటే భయం పుట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అత్యున్నత ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మహిళల రక్షణ కోసం తీసుకొచ్చే చట్టాలు, నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని కోర్టు ఘాటుగా స్పష్టం చేసింది. రాత్రి 11 గంటల సమయంలో కూడా దిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని రహదారులపై, మెట్రో రైళ్లలో మహిళలు అత్యంత భద్రంగా, స్వేచ్ఛగా తిరిగేలా పరిస్థితులు కల్పించాలని సూచించింది. దేశంలో ప్రతి మహిళ కూడా తాము పూర్తి సురక్షితంగా ఉన్నామని భావించినప్పుడే ఈ చర్యలకు సార్థకత చేకూరుతుందని పేర్కొంది. నేరం జరిగిన తర్వాత విచారణలు చేపట్టడం కంటే కూడా, అసలు నేరమే జరగకుండా ముందే కట్టడి చేయడమే అత్యంత కీలకమైన అంశమని, ఇలాంటి నేరాలకు పాల్పడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయనే భయం క్రిమినల్స్‌లో రావాలని స్పష్టం చేసింది.
మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టే క్రమంలో పోలీసులు , అధికారులు అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడకూడదని న్యాయస్థానం సూచించింది. ఈ ప్రక్రియలో మానవ హక్కుల వంటి విమర్శలు లేదా ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం చట్టపరంగా సాధ్యమైనంత కర్కశంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో రాత్రివేళల్లో పోలీసు పెట్రోలింగ్‌ను గణనీయంగా పెంచాలని, అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది.
ఇటీవల దిల్లీలోని ఒక పార్క్‌లో 17 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, అలాగే స్వరూప్ నగర్లో టీనేజీ అమ్మాయిపై గ్యాంగ్‌రేప్ జరిపి దారుణంగా హత్య చేసిన ఘటనలతో పాటు, స్లీపర్ బస్సులో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వార్తలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. వరుసగా వెలుగుచూసిన ఈ ఘోరాల తీవ్రతను స్వయంగా పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, ఈ వ్యవహారంపై సుమోటోగా విచారణ చేపట్టి విచారణను వేగవంతం చేసింది.