Haryana Horror: వీడు మనిషేనా.. అర నిమిషంలో 30 కత్తిపోట్లు.. కేసు వెనక్కి తీసుకున్నా కనికరం చూపలేదు.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..
హర్యానాలోని ఫరిదాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే.. పట్టపగలు పాఠశాల ప్రాంగణంలోనే ఒక పోకిరీ కిరాతకానికి ఒడిగట్టాడు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కక్షతో ఓ ప్రైవేట్ ఉపాధ్యాయినిపై కత్తితో దారుణంగా దాడి చేసి హత్య చేశాడు
Haryana Horror: హర్యానాలోని ఫరిదాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే.. పట్టపగలు పాఠశాల ప్రాంగణంలోనే ఒక పోకిరీ కిరాతకానికి ఒడిగట్టాడు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కక్షతో ఓ ప్రైవేట్ ఉపాధ్యాయినిపై కత్తితో దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. హర్యానాలోని ఫరీదాబాద్ సిక్రోనా గ్రామంలో ఉన్న సరస్వతి సీనియర్ స్కూల్‌లో సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘోర దారుణం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఫరీదాబాద్‌కు చెందిన 29 ఏళ్ల సంధ్య సిక్రోనా గ్రామంలోని సరస్వతి సీనియర్ సెకండరీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం ఆమె పాఠశాలకు వచ్చి విధుల్లో ఉండగా.. ఒక యువకుడు ఆమెను కలవాలంటూ గేటు వద్దకు వచ్చాడు. సిబ్బంది ఇచ్చిన సమాచారంతో సంధ్య బయటకు రాగానే.. అప్పటికే ముసుగు ధరించి వేచి ఉన్న నిందితుడు ఆమెపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.
పాఠశాలలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ప్రకారం.. నిందితుడు సంధ్య బయటకు రాగానే ఆమెను లాగి, కత్తితో వరుస పెట్టి పొడిచాడు. ముఖం, మెడ, ఛాతీ, పొట్ట భాగాల్లో అర నిమిషంలోనే దాదాపు 20 నుంచి 30 సార్లు దారుణంగా పొడిచాడు. సంధ్య అరుపులు విని పాఠశాల నిర్వాహకుడు తేజ్‌పాల్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. నిందితుడు ఆయనపై కూడా కత్తితో దాడికి తెగబడటంతో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. రక్తం మడుగులో కుప్పకూలిన సంధ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. నిందితుడు బైక్‌పై పరారయ్యాడు. ఉపాధ్యాయినిపై జరిగిన ఈ భయానక దాడిని చూసి విద్యార్థులు, తోటి సిబ్బంది భయాందోళనలతో దూరంగా పరుగులు తీశారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని సిక్రోనా గ్రామానికి చెందిన అమిత్ (21)గా గుర్తించి, ఘటన జరిగిన రెండు గంటల్లోనే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. సంధ్యకు, అమిత్‌కు రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అయితే సంధ్య అతనితో మాట్లాడటానికి ఆసక్తి చూపకపోయినా.. అమిత్ నిరంతరం వెంటపడుతూ వేధించేవాడు. వేధింపులు మితిమీరడంతో ఇటీవల సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో పోలీసుల ముందర అమిత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో.. ఆమె దయతో కేసును వాపసు తీసుకుంది. అయినప్పటికీ, తనపై ఫిర్యాదు చేసిందన్న కక్షను మనసులో ఉంచుకున్న నిందితుడు, ప్రతీకారంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.