Hospital Billing Disputes: ఆసుపత్రులకు కేంద్రం కీలక ఆదేశాలు.. బెడ్ ఛార్జీల నుంచి ఆపరేషన్ ఖర్చుల వరకు అన్ని ధరల బోర్డులు బయట పెట్టాల్సిందే..

దేశంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ, చికిత్సల వ్యయంపై జవాబుదారీతనం , పారదర్శకతను పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది

Hospital (Photo-Istock)

Hospital Billing Disputes: దేశంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ, చికిత్సల వ్యయంపై జవాబుదారీతనం , పారదర్శకతను పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు, క్లినిక్‌లు తదితర వైద్య సంస్థలు తమ వద్ద అందుబాటులో ఉన్న వివిధ వైద్య సేవలు, పడకల రుసుము, వ్యాధి నిర్ధారణ పరీక్షల ధరల పట్టికను రోగులకు, వారి సహాయకులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలను పంపించింది.  భారత్‌ను వీడుతున్న విదేశీ పెట్టుబడిదారులు.. స్టాక్ మార్కెట్ల నుంచి రూ.3 లక్షల కోట్లకు పైగా ఫారిన్ పెట్టుబడులు ఔట్.. అసలు కారణాలివే..

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్యసలిల శ్రీవాస్తవ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఈ విషయమై అధికారికంగా లేఖలు రాశారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం కింద నిర్దేశించిన నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, ఏ ఒక్క ఆసుపత్రి కూడా ఈ నిబంధనలను ఉల్లంఘించకుండా చూడాలని చెప్పారు. వైద్య చికిత్స ప్రారంభం కాకముందే అయ్యే వ్యయ సమాచారం రోగులకు ముందస్తుగానే అందుబాటులో ఉండటం ద్వారా దోపిడీని అరికట్టవచ్చని స్పష్టం చేశారు.

ధరల పట్టిక ప్రదర్శన నిబంధనల ముఖ్యాంశాలు:

బహుభాషా ప్రదర్శన: ప్రతి వైద్య కేంద్రం తమ రిసెప్షన్ లేదా ఆవరణలో అందరికీ సులభంగా కనిపించే ప్రముఖ స్థలాల్లో స్థానిక భాషతో పాటు ఆంగ్లంలో కూడా వివిధ సేవల రుసుముల వివరాలను ప్రదర్శించాలి.

సేవల వివరణ: ఓపీడీ (OPD) ఫీజులు, సాధారణ పడకలు, ఐసీయూ (ICU) పడకల ధరలు, ల్యాబ్ , డయాగ్నోస్టిక్ పరీక్షల చార్జీలు, ప్రధాన శస్త్రచికిత్సల అంచనా వ్యయాల జాబితాను పారదర్శకంగా ప్రదర్శించాల్సి ఉంటుంది.

విదేశీ రోగులకు ప్యాకేజీ ధరలు: భారతదేశానికి మెడికల్ విసాలపై వచ్చే అంతర్జాతీయ రోగుల కోసం కూడా ఆసుపత్రులు నిర్దిష్ట ప్యాకేజీ ధరలను ప్రదర్శించేలా ప్రోత్సహించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

ఆసుపత్రులలో చికిత్స ముగిసాక అదనపు రుసుములు లేదా అస్పష్టమైన బిల్లుల పేరుతో రోగుల కుటుంబాలపై ఆర్థిక భారం వేయడం, తద్వారా జరిగే వివాదాలను తగ్గించడమే ఈ చర్య ప్రధాన లక్ష్యమని కేంద్రం పేర్కొంది. వైద్య సేవల విషయంలో పారదర్శకత లోపిస్తే ఆయా ఆసుపత్రుల రిజిస్ట్రేషన్‌పై చర్యలు తీసుకునేందుకు స్థానిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement