Kerala Shocker: తాతపై మనవరాలు దారుణం.. ప్రియుడు చంపుతుంటే తాత హత్యను వీడియో కాల్‌లో చూసిన 13 ఏళ్ల బాలిక.. నిందితులంతా అరెస్ట్..
కేవలం ఐఫోన్, ఖరీదైన బైక్ కొనుగోలు చేయాలనే వికృతమైన కోరికతో.. ఒక 13 ఏళ్ల బాలిక తన 15 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్, మరో ముగ్గురు మైనర్ స్నేహితులతో కలిసి సొంత తాతనే అత్యంత దారుణంగా హత్య చేయించింది.
Kerala Shocker: ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా మత్తు యువతను, చిన్నారులను ఎంతటి దారుణాలకైనా ఒడిగట్టేలా చేస్తోందనడానికి కేరళలో వెలుగుచూసిన ఈ ఘటనే సజీవ నిదర్శనం. కేవలం ఐఫోన్, ఖరీదైన బైక్ కొనుగోలు చేయాలనే వికృతమైన కోరికతో.. ఒక 13 ఏళ్ల బాలిక తన 15 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్, మరో ముగ్గురు మైనర్ స్నేహితులతో కలిసి సొంత తాతనే అత్యంత దారుణంగా హత్య చేయించింది. కేరళలోని అలప్పుజ జిల్లా హరిపాడ్ బ్లాక్ పంచాయతీ పరిధిలో జరిగిన ఈ నమ్మలేని ఉదంతం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, భయాందోళనలను రేకెత్తించింది.
పోలీసుల కథనం ప్రకారం.. సదరు బాలిక నిత్యం మొబైల్ ఫోన్ వాడటం, చదువును నిర్లక్ష్యం చేయడంపై తాత పలుమార్లు మందలించారు. దీంతో తాతపై తీవ్ర కక్ష పెంచుకున్న బాలిక, ఆయనను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా తాత ఇంట్లో దాచి ఉంచిన బంగారాన్ని అమ్మి తాను కొత్త ఐఫోన్ కొనుక్కోవాలని, అలాగే తన 15 ఏళ్ల ప్రియుడికి ఖరీదైన బైక్ కొనివ్వాలని పక్కా ప్రణాళిక రచించింది. ఇందుకోసం యూట్యూబ్‌లో లభించే క్రైమ్ థ్రిల్లర్లు, హత్యలు చేసే విధానాలకు సంబంధించిన వీడియోలను చూసి పథకాన్ని సిద్ధం చేసుకుంది.
బాధితుడు తన భార్య, గర్భిణి అయిన కుమార్తె, మనవరాలితో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఇటీవల కుమార్తెకు పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు తోడుగా బామ్మ కూడా ఆసుపత్రిలోనే ఉండిపోయింది. ఇంట్లో తాత ఒక్కడే ఒంటరిగా ఉన్నాడని గుర్తించిన మనవరాలు, ఇదే సరియైన సమయమని భావించింది. తాను పరీక్షల ప్రిపరేషన్ సాకుతో స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత, తాత తనపై అసభ్యంగా ప్రవర్తించాడని అబద్ధాలు చెప్పి తన ప్రియుడిని, అతని స్నేహితులను రెచ్చగొట్టి హత్యకు పురిగొల్పింది.
పథకం ప్రకారం.. నిందితులైన మైనర్లు రాత్రి వేళ ఇంటి వెనుక ఉన్న వెంటిలేటర్ ద్వారా లోపలికి ప్రవేశించారు. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధుడిపై ఒక్కసారిగా దాడి చేసి, తీవ్రంగా కొట్టారు. అనంతరం ఆయన కాళ్లు, చేతులు కట్టేసి గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ దారుణమంతటినీ బాలిక తన ఫోన్ ద్వారా వీడియో కాల్‌లో లైవ్‌గా వీక్షించడం గమనార్హం. హత్య అనంతరం, పోలీసులకు, డాగ్ స్క్వాడ్‌కు ఎలాంటి క్లూస్ లభించకూడదనే ఉద్దేశంతో ఘటనా స్థలంలో కారం పొడి చల్లారు. ఆ తర్వాత ఇంట్లోని 4.5 సవర్ల (సుమారు 36 గ్రాములు) బంగారు ఆభరణాలు, కొంత నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు వేగవంతం చేశారు. విచారణలో బాలిక చెప్పిన సమాధానాలు పరస్పర విరుద్ధంగా, పొంతన లేకుండగా ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమె కాల్ డేటా, వాట్సాప్ చాట్‌లను విశ్లేషించగా అసలు నిజం బయటపడింది. హత్య జరిగిన 24 గంటల వ్యవధిలోనే పోలీసులు ఐదుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కొల్లాంలో విక్రయించిన బంగారు ఉంగరంతో సహా మిగిలిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరినీ జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. సైబర్ ప్రపంచం బాలల మనస్సులపై ఎంతటి ప్రతికూల ప్రభావం చూపుతోందో ఈ ఘటన నిరూపిస్తోంది.