Chandipura Virus: చండీపుర వైరస్ అంటే ఏమిటి.. ఇది ఎలా వ్యాపిస్తుంది.. దీని లక్షణాలు, చికిత్స, జాగ్రత్తలు ఇవే.. గుజరాత్‌లో 22 మంది చిన్నారులు మృతితో తీవ్ర ఆందోళన..

గుజరాత్‌లో మరోసారి చండీపుర వైరస్ (CHPV) కలకలం రేపుతోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఇప్పటివరకు 22 మంది చిన్నారులు మృతి చెందగా.. మరో 35 మందికి వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

Chandipura Virus Alert(X)

Chandipura Virus: గుజరాత్‌లో మరోసారి చండీపుర వైరస్ (CHPV) కలకలం రేపుతోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఇప్పటివరకు 22 మంది చిన్నారులు మృతి చెందగా.. మరో 35 మందికి వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. సాధారణ జ్వరంలా ప్రారంభమయ్యే ఈ వైరస్ కొద్ది గంటల్లోనే మెదడుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతో వైద్య నిపుణులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

చండీపుర వైరస్ రాబ్డోవిరిడే (Rhabdoviridae) కుటుంబానికి చెందిన వైరస్. దీన్ని భారతదేశంలో తొలిసారిగా 1965లో మహారాష్ట్రలోని చండీపుర గ్రామంలో గుర్తించారు. ఈ వైరస్ ప్రధానంగా శాండ్‌ఫ్లై (ఇసుక ఈగ) కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇప్పటివరకు ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపించినట్లు ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.

భారత్‌లో భారీగా పెరుగుతున్న అంటువ్యాధులు, ఐసీఎంఆర్‌ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి.. అలర్ట్ కాకుండా అంతే సంగతులిక..

ఎవరికి ఎక్కువ ప్రమాదం?:

ఈ వైరస్ ముఖ్యంగా 15 ఏళ్లలోపు చిన్నారులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాలు, ఇసుక ఈగలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే పిల్లలకు ప్రమాదం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో శాండ్‌ఫ్లైలు అధికంగా పెరగడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

లక్షణాలు ఎలా ఉంటాయి?:

ప్రారంభంలో ఈ వైరస్ సాధారణ వైరల్ జ్వరంలా కనిపిస్తుంది.

తీవ్రమైన జ్వరం

తలనొప్పి

వాంతులు

విరేచనాలు

నీరసం

ఫ్లూ వంటి లక్షణాలు

అయితే పరిస్థితి విషమిస్తే వైరస్ మెదడుపై ప్రభావం చూపి ఎన్‌సెఫలైటిస్ (మెదడు వాపు)కు దారితీస్తుంది. దీంతో మూర్ఛలు, స్పృహ కోల్పోవడం, కోమాలోకి వెళ్లడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఆసుపత్రిలో చేరిన 48 నుంచి 72 గంటల్లోనే పరిస్థితి విషమించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

చికిత్స ఉందా?: ప్రస్తుతం చండీపుర వైరస్‌కు ప్రత్యేకమైన మందు లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. రోగిలో కనిపించే లక్షణాల ఆధారంగా మాత్రమే వైద్యులు చికిత్స అందిస్తారు. అందువల్ల ముందస్తు జాగ్రత్తలే అత్యంత కీలకం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

పిల్లలకు పూర్తి శరీరాన్ని కప్పే దుస్తులు వేయాలి.

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.

దోమతెరలు, కీటకనాశక మందులు ఉపయోగించాలి.

ఇసుక ఈగలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పిల్లలు ఎక్కువసేపు ఉండకుండా చూడాలి.

జ్వరంతో పాటు వాంతులు, మూర్ఛలు లేదా ఇతర నాడీ సంబంధిత లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం, వర్షాకాలంలో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రాణాపాయాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement