Deeban Lingesh: వీడియో ఇదిగో.. హ్యాట్రిక్‌తో సంచలనం సృష్టించిన దీబన్ లింగేష్.. తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో వరుసగా మూడు వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు..
తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) 2026 సీజన్ క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో విడ కోవై కింగ్స్ ఫాస్ట్ బౌలర్ దీబన్ లింగేష్ చారిత్రాత్మక హ్యాట్రిక్‌తో సంచలనం సృష్టించాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ పోరులో ట్రిచీ గ్రాండ్ చోళులపై కోవై కింగ్స్ 84 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఘనంగా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్ ఎస్. లోకేశ్వర్ 66 పరుగులతో మెరుపు అర్ధశతకం సాధించగా, కెప్టెన్ షారుఖ్ ఖాన్ ఆఖర్లో 18 బంతుల్లోనే 34 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రిచీ గ్రాండ్ చోళులకు దీబన్ లింగేష్ తొలి ఓవర్లోనే షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ మొదటి మూడు బంతుల్లోనే వరుసగా కె. రాజ్‌కుమార్, ఎస్. శ్యామ్ సుందర్, జగతీసన్ కౌసిక్‌లను అవుట్ చేసి ఈ సీజన్‌లోనే తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ముగ్గురు బ్యాటర్లు గోల్డెన్ డక్‌గా వెనుదిరగడంతో చోళులు 0/3తో తీవ్ర కష్టాల్లో పడ్డారు. లింగేష్ తన 4 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.
ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బతిన్న చోళులు 15.4 ఓవర్లలో కేవలం 99 పరుగులకే ఆలౌట్ అయ్యారు. కోవై కింగ్స్ బౌలర్ మణిమారన్ సిద్ధార్థ్ 11 పరుగులిచ్చి 4 వికెట్లతో రాణించాడు. ఈ అద్భుత విజయంతో విడ కోవై కింగ్స్ ఆగస్టు 28, 2026న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనున్న టీఎన్‌పీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్‌లో ట్రోఫీ కోసం తలపడనుంది.
Deeban Lingesh Becomes First Bowler to Take a Hat-Trick