Vijayawada-Tirupati Flight: తిరుపతికి వెళ్లేవారికి బంపర్ ఆఫర్.. విజయవాడ నుంచి గంటలోనే ప్రయాణం.. తక్కువ ధరకే కొత్త విమాన సర్వీసు
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు, ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల ప్రయాణికులకు 'ఫ్లై 91' విమానయాన సంస్థ శుభవార్త అందించింది. విజయవాడ (గన్నవరం), తిరుపతి నగరాల మధ్య నేరుగా నూతన విమాన సేవలను ప్రారంభించింది
Vijayawada-Tirupati Flight: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు, ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల ప్రయాణికులకు 'ఫ్లై 91' విమానయాన సంస్థ శుభవార్త అందించింది. విజయవాడ (గన్నవరం), తిరుపతి నగరాల మధ్య నేరుగా నూతన విమాన సేవలను ప్రారంభించింది. సాధారణంగా రోడ్డు లేదా రైలు మార్గంలో 7 నుండి 8 గంటలు పట్టే ప్రయాణ సమయం ఈ విమాన సర్వీస్ ద్వారా కేవలం ఒక గంటకు తగ్గిపోనుంది.
ఈ నూతన విమాన సర్వీస్ వారానికి నాలుగు రోజుల పాటు (మంగళ, గురు, శని, ఆదివారాల్లో) అందుబాటులో ఉంటుంది. తిరుపతిలో ఉదయం 8:05 గంటలకు బయలుదేరే విమానం ఉదయం 9:15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడలో ఉదయం 9:45 గంటలకు బయలుదేరి ఉదయం 10:50 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ప్రయాణానికి ఒకవైపు ఛార్జీ సుమారు రూ. 3,000 నుండి రూ. 3,500 వరకు ఉంటుందని సంస్థ తెలిపింది.
ఈ విమానంలో ప్రయాణించే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. తిరుపతి విమానాశ్రయంలోని టీటీడీ కౌంటర్‌లో విమాన బోర్డింగ్ పాస్, గుర్తింపు కార్డు చూపించి శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం రూ. 10,000 విరాళంతో పాటు రూ. 500 దర్శన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఈ కోటా కింద 200 టికెట్లు కేటాయించారు. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు విమానాశ్రయంలోనే దర్శన టికెట్ లభించే సదుపాయం ఉండటంతో ఈ సర్వీసుకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది.