Tribute to Nomula: పేదల మనిషి.. బలహీన వర్గాల గొంతుక నోముల! దివంగత సభ్యులకు సంతాప తీర్మానాన్ని శాసన సభలో ప్రవేశపెట్టిన టీఎస్ సీఎం కేసీఆర్, నోముల నర్సింహయ్యకు ఘన నివాళి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజున దివంగత సభ్యులకు నివాళిగా సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య సేవలను, ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు....

CM KCR- Telangana Assembly Session | Photo: CMO

Hyderabad, March 17:   తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజున దివంగత సభ్యులకు నివాళిగా సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య సేవలను, ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు.

ఉద్యమశీలి, ప్రజా నాయకుడు నర్సింహయ్య సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపించిన వ్యక్తి. పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ చైతన్యాన్ని పుణికిపుచ్చుకొని బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసమే వారి జీవితాన్ని అంకితం చేశారు. విద్యార్థిగా, న్యాయవాదిగా, కమ్యూనిస్టు నాయకుడిగా, శాసన సభ్యునిగా నోముల నిరంతరం ప్రజా సేవలోనే గడిపారని కేసీఆర్ కొనియాడారు.

" 1956, జనవరి 9న నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం, పాలెం గ్రామంలో పేద యాదవ కుటుంబంలో జన్మించిన నోముల నర్సింహయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ, ఎల్.ఎల్.బి పూర్తి చేశారు. విద్యార్థి దశ నుండే ఉద్యమాలకు నాయకత్వం వహించారు. న్యాయవాదిగా పనిచేస్తున్న తరుణంలోనూ ఆయన పేదలపక్షం వహించి, ప్రజల న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. కమ్యూనిస్టు దృక్పథం కలిగిన నర్సింహయ్య సమాజంలో దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్మించారు. తన ఆశయాలకు అనుగుణంగా సీపీఎం పార్టీలో చేరారు. నకిరేకల్ ఎంపీపీ అధ్యక్షునిగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం శాసనసభా పక్ష నాయకుడిగా ఎదిగేదాకా సాగింది. శాసనసభలో తెలంగాణ నుడికారం ఉట్టిపడే విధంగా సామెతలు, ఛలోక్తులతో కూడిన నోముల నర్సింహయ్య ప్రసంగాలు ప్రత్యేకంగా ఆకర్శించేవి.

ప్రతిపక్ష నేతగా, శాసనసభలో ఏ విధంగా వ్యవహరించాలో, హుందాతనాన్ని ఎలా ప్రదర్శించాలో, ప్రజల సమస్యలను ప్రభావ పూర్వకంగా సభలో ఎలా ప్రస్తావించాలో.. నేటితరం నాయకులకు నోముల నర్సింహయ్య ఆదర్శం.

ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతుల సాగునీటి హక్కుల కోసం, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ రైతుల ప్రయోజనాల కోసం స్వర్గీయ నర్సింహయ్య నిరంతరం పోరాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎన్నికై ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడ్డారు.

సీపీఎం పార్టీకి విశేష సేవలందించిన నోముల నర్సింహయ్య, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరితో విభేదించి ఆ పార్టీ నుంచి వైదొలిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారానే తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయనే విశ్వాసంతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో టీఆర్ఎస్ తరఫున నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ నియోజకవర్గం అభివృద్ధి కోసం చివరిశ్వాస వరకు కృషిచేశారు. పేద యాదవ కుటుంబంలో జన్మించిన నోముల నర్సింహయ్య బడుగువర్గాల ప్రతినిధిగా వారి సంక్షేమం కోసం నిరంతరం తపించారు.

64 ఏళ్ల వయస్సులో గత డిసెంబరులో గుండెపోటుతో ఆయన ఆకస్మికంగా మరణించడం తెలంగాణ ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. ప్రజా పోరాటాలను అభిమానించే వారందరికీ ఆయన మరణం తీరని దు:ఖాన్ని మిగిల్చింది. వ్యక్తిగతంగా నాకెంతో సన్నిహితులైన నోముల నర్సింహయ్య గారు తెలంగాణ అభివృద్ధి కోసం తన ఆలోచనల్ని నాతో నిరంతరం పంచుకునేవారు. వారి ఆత్మీయతను, విలువల పట్ల వారి నిబద్ధతను నేనెప్పటికీ మరువలేను. నిజమైన ప్రజా నాయకుడిగా నోముల నర్సింహయ్య తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. వారి మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ సభ తీర్మానిస్తున్నది". అని సీఎం కేసీఆర్ సభలో సుదీర్ఘ ఉపన్యాసం చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement