AI Virus Research: ఏఐతో కొత్త వైరస్ సృష్టించిన శాస్త్రవేత్తలు.. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగమైతే పరిస్థితి ఏంటి..
కృత్రిమ మేధ (Artificial Intelligence) జీవసంబంధ పరిశోధనల్లో వేగంగా వినియోగంలోకి వస్తోంది. ఔషధాల అభివృద్ధి, వ్యాక్సిన్ పరిశోధనలు, వ్యాధుల విశ్లేషణ వంటి రంగాల్లో AI కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, అదే సాంకేతికతను కొత్త వైరస్‌ల రూపకల్పనకు దుర్వినియోగం చేసే అవకాశం ఉందనే ఆందోళనలను బయోసెక్యూరిటీ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
AI Virus Research: కృత్రిమ మేధ (AI) సాయంతో సంపూర్ణ జన్యువులను (Complete Genomes) రూపకల్పన చేసి.. ప్రయోగశాలలో పునరుత్పత్తి చెందగల పూర్తి స్థాయి కొత్త వైరస్‌లను అమెరికా పరిశోధకులు విజయంవంతంగా సృష్టించారు. వైద్య విధానాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే ఈ పురోగతిని శాస్త్రవేత్తలు సైన్స్‌లో ఒక చారిత్రాత్మక మలుపుగా అభివర్ణిస్తుండగా.. అంతర్జాతీయంగా జీవభద్రత (Biosecurity)పై ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అమెరికాలోని ప్రముఖ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 'Evo1', 'Evo2' అనే ఏఐ నమూనాల (Generative AI Models) ద్వారా జీవశాస్త్ర సంకేతాలను అంచనా వేస్తూ ఈ డిజైన్లను రూపొందించారు. మనుషులకు ఎటువంటి హాని కలిగించకుండా.. కేవలం నిర్దిష్ట బ్యాక్టీరియాకు మాత్రమే సోకే బ్యాక్టీరియోఫేజ్ రకానికి చెందిన వైరస్‌లను సృష్టించారు.
యాప్ స్టోర్ నుండి టెలిగ్రామ్ తాత్కాలిక తొలగింపు.. ఆపిల్ నిర్ణయం వెనుక ఉగ్రవాద అభియోగాల కలకలం..
ఏఐ రూపొందించిన 302 మోడళ్లలో 16 డిజైన్లు ప్రయోగశాలలో ఇ. కోలి బ్యాక్టీరియాను విజయవంతంగా నాశనం చేశాయి. ఈ సాంకేతికత ద్వారా యాంటీబయాటిక్స్‌కు లొంగని మొండి ఇన్‌ఫెక్షన్లకు.. జన్యుపరమైన రుగ్మతలకు కొత్త తరహా చికిత్సలను అందించవచ్చని అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రియాన్ హై వెల్లడించారు.
ప్రఖ్యాత సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంపై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సాంకేతికత.. దుర్మార్గుల చేతుల్లోకి వెళ్తే మానవాళికి హాని కలిగించే కొత్త వ్యాధులను సృష్టించే ప్రమాదముందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ థామస్ ఇంగ్లెస్‌బై హెచ్చరించారు.
ముందస్తు జాగ్రత్తగా మానవులకు లేదా సంక్లిష్ట జీవులకు సోకే వైరస్‌ల డేటాను శిక్షణా విభాగం నుంచి మినహాయించి.. అత్యున్నత భద్రత కలిగిన ల్యాబ్‌లోనే ఈ ప్రయోగాలు నిర్వహించినట్లు పరిశోధకులు స్పష్టం చేశారు. కంప్యూటర్ బిట్స్ నుంచి జీవకణాల తయారీ దిశగా సాగుతున్న ఈ ప్రయాణం సింథటిక్ బయాలజీ రంగంలో కొత్త శకానికి నాంది పలికింది.