Jammu & Kashmir: అది ప్రత్యేక హోదా కాదు, 'ప్రత్యేక వివక్ష' ! జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని ప్రాంతాలలో ఆంక్షలు ఎత్తివేత. మొబైల్ నెట్‌వర్క్స్ సైతం పనిచేస్తున్నాయని ప్రకటించిన అధికార యంత్రాగం.
కశ్మీరి ప్రజలందరికీ లబ్ది చేకూరేలా దాదాపు 85 కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రవేశపెడుతున్నట్లు అధికారులు తెలిపారు...
Srinagar, September 13: ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ (Jammu & Kashmir) లో ఇప్పటివరకు విధించిన ఆంక్షలను అన్ని ప్రాంతాల్లో ఎత్తివేసినట్లు జమ్మూకాశ్మీర్ పరిపాలన యంత్రాంగం తెలిపింది. రోడ్లపై జనసంచారం మరియు ట్రాఫిక్ చాలా రేట్లు పెరిగింది. ల్యాండ్‌లైన్‌లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు కూడా "గణనీయంగా పనిచేస్తున్నాయి". కుప్వారా మరియు హంద్వారా జిల్లాలలో మొబైల్ నెట్‌వర్క్స్ యాక్టివ్‌గా ఉన్నాయని జమ్మూకాశ్మీర్ పరిపాలన విభాగం ప్రిన్సిపల్ సెక్రెటరీ రోహిత్ కన్సల్ పేర్కొన్నారు.
ప్రజలపై ఎలాంటి ఆంక్షలు లేవు. ప్రజలు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టినా, లేదా ఎలాంటి ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నా కూడా వారిని అడ్డుకునేలా ఎలాంటి నిషేధాజ్ఞలు కూడా విధించబడి లేవు. అయితే శాంతియుత నిరసనలకు మాత్రమే అనుమతి ఉంది. నిరసనల ముసుగులో ఎవరైనా రెచ్చగొట్టే కార్యక్రమాలు నిర్వహించినా, హింసాత్మకమైన ఘటనలకు పాల్పడే వారిపై మాత్రం చట్టప్రకారంగా చర్యలు తీసుకోబడతాయని కన్సల్ వివరించారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ వ్యాప్తంగా పూర్తి ప్రశాంత వాతావరణం ఉన్నట్లు ఆయున స్పష్టం చేశారు.
జాతీయ భద్రతా సలహాదారు సూచనల మేరకు జమ్మూకాశ్మీర్ పరిపాలనా యంత్రాంగం ఆంక్షలను ఎత్తివేసింది. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో అలజడులను, అశాంతిని సృష్టించడానికి పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నించింది. అందుకే అక్కడ నిషేధాజ్ఞలు అమలు చేయాల్సి వచ్చిందని అజిత్ దోవల్ (Ajit Doval) చెప్పుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్ లో మెజారిటీ ప్రజలు ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తున్నట్లు తాను పూరిగా విశ్వసిస్తున్నాను అని అజిత్ దోవల్ పేర్కొన్నారు. ఆగష్టు 05న కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత అక్కడ పరిస్థితిని NSA అజిత్ దోవల్ (National Security Adviser) స్వయంగా పర్యవేక్షించారు. జమ్మూకాశ్మీర్ లో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ కాశ్మీరీ ప్రజలతో మమేకమై ఆర్టికల్ 370 రద్దుపై ప్రజాభిప్రాయాలు సేకరించిన విషయం తెలిసిందే.
జమ్మూ కాశ్మీర్ కు 'ప్రత్యేక హోదా' తీసివేయడం ద్వారా కాశ్మీరీ ప్రజలను దేశంలోని భారతీయులందరితో సమానం చేశాం. ఆర్టికల్ 370 అనేది ప్రత్యేక హోదా కాదు, అది ఒక "ప్రత్యేక వివక్ష" గా అజిత్ దోవల్ అభివర్ణించారు.
జమ్మూకాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారడంతో అక్కడి ప్రజలకు ఇకపై కేంద్రం ప్రభుత్వమే అన్నిరకాల సదుపాయాలు కల్పించనుంది. కశ్మీరి ప్రజలందరికీ లబ్ది చేకూరేలా దాదాపు 85 కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రవేశపెడుతున్నట్లు అధికారులు తెలిపారు. జమ్మూకాశ్మీర్ మరియు లద్దాఖ్ లలో పెన్షన్, స్కాలర్ షిప్పులు, గృహాల మంజూరు ఇలా ప్రతి శాఖకు సంబంధించిన కేంద్ర పథకాలను ప్రతీ లబ్ది దారుడికి 100% చేరేలా పకడ్బందీ చర్యలు తీసుకోబోతున్నట్లు అధికారులు వివరించారు.