Supreme Court: కోర్టులు వినోద ఛానెళ్లుగా మారకూడదు.. అనుమతి లేకుండా కోర్టు విచారణల ఆడియో, వీడియోలు షేర్ చేయొద్దు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సంబంధిత సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ లేదా హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ ముందస్తు అనుమతి లేకుండా కోర్టు కార్యకలాపాల రికార్డింగ్‌లను షేర్ చేయడం, రీ-పోస్ట్ చేయడం లేదా వాటి ద్వారా డబ్బు సంపాదించడాన్ని నిషేధిస్తూ.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం శుక్రవారం కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది
Supreme Court: న్యాయవిచారణలకు సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్‌లను అనధికారికంగా ఎడిటింగ్ చేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. సంబంధిత సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ లేదా హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ ముందస్తు అనుమతి లేకుండా కోర్టు కార్యకలాపాల రికార్డింగ్‌లను షేర్ చేయడం, రీ-పోస్ట్ చేయడం లేదా వాటి ద్వారా డబ్బు సంపాదించడాన్ని నిషేధిస్తూ.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం శుక్రవారం కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు కోర్టు విచారణలకు సంబంధించి పత్రికలు, మీడియా చేసే నిష్పాక్షిక వార్తా నివేదనకు ఎలాంటి ఆటంకం కలిగించవని స్పష్టం చేసింది.
జర్నలిస్ట్ హర్షిత గ్రోవర్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) ఆధారంగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. కోర్టు విచారణల్లోని ప్రాథమిక వ్యాఖ్యలు.. మౌఖిక సంభాషణలను సందర్భం లేకుండా కత్తిరించి సంచలనాత్మక శీర్షికలతో యూట్యూబ్, ఫేస్‌బుక్, ఎక్స్ వంటి వేదికల్లో పోస్ట్ చేస్తూ ఆదాయం పొందుతున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీయడమే కాక న్యాయమూర్తులు, న్యాయవాదులను ట్రోలింగ్‌కు గురిచేస్తోందని వాదించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. ప్రత్యక్ష ప్రసారాలతో ఇబ్బంది లేకపోయినా, ఎడిట్ చేసిన క్లిప్‌లు వైరల్ కావడం వల్ల న్యాయస్థానాలు హాస్యాస్పదంగా మారుతున్నాయని పేర్కొన్నారు.
ఈ విచారణలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరై పిటిషన్‌ను సమర్థించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌ఫేక్ సాంకేతికత ద్వారా కోర్టు వీడియోల్లో పెదాల కదలికలకు అనుగుణంగా మాటలను మార్చి వక్రీకరించే ప్రమాదం ఉందనే విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. సీజేఐ సూర్యకాంత్ కూడా ముద్రణా మాధ్యమాల్లో సైతం తాము అనని మాటలను ఆపాదించి వక్రీకరిస్తున్నారంటూ తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. జస్టిస్ జయమల్య బాగ్చి మాట్లాడుతూ.. డిజిటల్ డేటా నియంత్రణ సవాలుగా మారిందని, కోర్టులు 24/7 వినోద ఛానెళ్లుగా మారకూడదని ఆందోళన వ్యక్తం చేస్తూ.. లైవ్‌స్ట్రీమింగ్‌కు పరిమిత ప్రాప్యత కల్పించేలా నియంత్రణలు ఉండాలన్నారు.
ఈ పిటిషన్‌పై స్పందిస్తూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి.. మెటా, ఎక్స్ వంటి సోషల్ మీడియా సంస్థలకు, అలాగే అన్ని రాష్ట్రాల హైకోర్టులకు నోటీసులు జారీ చేసింది. లైవ్‌స్ట్రీమింగ్ అమలు తీరుపై నివేదికలు ఇవ్వాలని హైకోర్టులను ఆదేశించడంతో పాటు.. ఈ నిబంధనలను పర్యవేక్షించేందుకు నోడల్ మంత్రిత్వ శాఖలను నిర్దేశించాలని కేంద్రానికి సూచించింది. పారదర్శకతను కాపాడుతూనే, డిజిటల్ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.