Global Ocean Warming: ప్రపంచ మహాసముద్రాలు ఎందుకు వేడెక్కుతున్నాయి.. ప్రతి సెకనుకు లక్ష హిరోషిమా అణుబాంబులు పేలితే విడుదలయ్యే అంత వేడితో సముద్రాలు..

ప్రపంచ మహాసముద్రాల ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరి సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక్క జూన్ నెలలో నమోదైన సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేశాయని అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

Super El Niño

Global Ocean Warming: ప్రపంచ మహాసముద్రాల ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరి సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక్క జూన్ నెలలో నమోదైన సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేశాయని అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. సెప్టెంబర్ నాటికి అవి తీవ్ర రూపం దాల్చాయని చెబుతున్నారు. 1870 నాటి పారిశ్రామిక విప్లవానికి ముందు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 19.6 డిగ్రీల సెల్సియస్‌గా ఉండగా, ప్రస్తుతం అది దాదాపు 21 డిగ్రీల సెల్సియస్‌ దాటింది.

పెరిగిన ఈ 1.4 డిగ్రీల వ్యత్యాసం చిన్నదిగా అనిపించినప్పటికీ, విశాలమైన మహాసముద్రాలను ఈ స్థాయిలో వేడెక్కించడానికి అపారమైన శక్తి అవసరమవుతుంది. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువుల వాడకం వల్ల వెలువడే గ్రీన్‌హౌస్ వాయువులు బంధించిన అదనపు వేడిలో దాదాపు 90 శాతానికి పైగా సముద్రాలే గ్రహించడం దీనికి ప్రధాన కారణం. 2025 నాటికి సముద్రాలలో నిల్వ ఉన్న ఈ అదనపు శక్తి, ప్రతి సెకనుకు 1,20,000 హిరోషిమా అణుబాంబులు పేలితే విడుదలయ్యే వేడితో సమానమని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.  తీవ్రరూపం దాలుస్తున్న 'సూపర్ ఎల్ నినో'.. తీవ్ర ఎండలు, కరువుతో 4.51 లక్షల మరణాల ముప్పు..

ఇప్పటికే తీవ్రంగా ఉన్న ఈ పరిస్థితికి తోడు పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా రూపాంతరం చెందుతున్న నూతన 'ఎల్ నినో' మరింత మంటలు రేపుతోంది. సాధారణంగా ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకోసారి సంభవించే ఈ వాతావరణ మార్పు వల్ల మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో నీరు అసాధారణంగా వేడెక్కుతుంది. దీనివల్ల 2026 సంవత్సరం రికార్డు స్థాయి వేడిని నమోదు చేయనుండగా, సముద్రపు లోతుల్లో ఉన్న వేడి ఉపరితలానికి రావడం వల్ల 2027 సంవత్సరం మానవాళికి మరింత భయంకరమైన వేడిని పరిచయం చేయనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐరోపా, మధ్యధరా సముద్ర ప్రాంతాలలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదు కాగా, పసిఫిక్ సముద్రపు లోతుల్లోనూ ఇదే తరహా ఉష్ణోగ్రత మార్పులు కనిపిస్తున్నాయి.

సముద్రాలలో రూపుదిద్దుకునే ఈ వేడి వాతావరణంలో తీవ్రమైన తుఫానులు, అకస్మాత్తుగా కురిసే క్లౌడ్ బరస్ట్ రకం భారీ వర్షాలు, నాశనకరమైన వరదలకు కారణమవుతోంది. ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియాల్లో తీవ్ర కరువు పరిస్థితులు, పశ్చిమ దక్షిణ అమెరికాలో భారీ వరదలు సంభవించే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, సముద్రపు వేడిగాలుల (Marine Heatwaves) వల్ల పగడపు దిబ్బలు, నాచు మైదానాలు దెబ్బతిని సముద్ర జీవావరణ వ్యవస్థ విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఆధునిక సాంకేతికత ద్వారా ఈ ముప్పును 3 నుండి 4 నెలల ముందే ఊహించి తీరప్రాంతాలను, చేపల వేటను నియంత్రించే అవకాశం ఉన్నప్పటికీ, వాతావరణ పరిశోధనా సంస్థల బడ్జెట్లలో కోతలు విధించడం రాబోయే రోజుల్లో కచ్చితమైన అంచనాలకు ఆటంకంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement