Dengue Fever Prevention: నీరసంగా అనిపిస్తూ ఆకలి వేయడం లేదా? అయితే అశ్రద్ధ చేయకండి. డెంగీ జ్వరం లక్షణాలు, నివారణ పద్ధతులను తెలుసుకోండి
కొంతమంది శరీర స్వభావాన్ని బట్టి ఉక్కపోత లేదా చలిగా అనిపించవచ్చు, ఒంటిపై దద్దులు, దురద సమస్యలు కలుగవచ్చు. బీపీ కూడా తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది. ఇలాంటి లక్షణాలు....
ఈ మధ్య కాలంలో జనాలను డెంగీ జరం (Dengue Fever) వీపరీతంగా భయపెడుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో చాలా చోట్ల అనేక డెంగీ కేసులు నమోదవుతున్నాయి. డెంగీ జ్వరం వలన మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే సరైన అవగాహనా, ఆహరపు అలవాట్లు, కొన్ని నివారణ పద్ధతుల ద్వారా డెంగీ నుంచి రక్షణ పొందవచ్చు.
డెంగీ ఫీవర్ లక్షణాలు (Dengue Fever Symptoms) తొందరగా బయటపడవు కానీ, ఈ జ్వరం బారిన పడితే రక్తకణాల్లో ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతుంది. దీంతో రోగనిరోధక శక్తి తగ్గిపోయి మంచాన పడతారు. దీనివల్ల నీరసంగా అనిపించడం, ఆకలి వేయకపోవడం, నాలుకకు ఎలాంటి రుచిలేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమంది శరీర స్వభావాన్ని బట్టి ఉక్కపోత లేదా చలిగా అనిపించవచ్చు, ఒంటిపై దద్దులు, దురద సమస్యలు కలుగవచ్చు. బీపీ కూడా తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే అశ్రద్ధ చేయకుండా డెంగీకి సంబంధించిన టెస్టులు చేసుకొని జాగ్రత్త పడాలి.
ఒకవేళ డెంగీ బారిన పడినట్లయితే కొన్ని ఆహార నియమాలను పాటించడం ద్వారా వ్యాధి నుండి కోలుకోవడం సులువవుతుంది. బొప్పాయి ఆకుల రసం (3-5 ఆకుల చూర్ణం మరియు రసం) తీసుకోవడం ద్వారా లేదా గిలోయ్ రసం తాగడం ద్వారా రోగ నిరోధక శక్తి (Immunity Power)పెరగడానికి తోడ్పడతాయి. మేక పాలలో కూడా పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయని న్యూట్రిషనిస్టులు వెల్లడిస్తున్నారు.
డెంగీ జ్వరాన్ని ఎలా నివారించవచ్చు
డెంగీ జ్వరం అనేది వైరల్ ఇన్ఫెక్షన్, ఇది ఈడెస్ ఈజిప్టి (Aedes Aegypti) అనే ఆడ దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది. డెంగీకి సిఫారసు చేయబడిన ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఇది దోమల ద్వారా సంక్రమించే వ్యాధి కాబట్టి, దోమ కాటుకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చు.
- స్లీవ్ లెస్ కాకుండా పొడవాటి స్లీవ్ చొక్కాలు మరియు పొడవైన ప్యాంటు ధరించాలి.
- పెర్మెత్రిన్ (permethrin) వంటి స్ప్రేలను వేసుకున్న బట్టలకు కూడా స్ప్రే చేసుకోవచ్చు.
- DEET వంటి EPA- రిజిస్టర్డ్ దోమల నియంత్రణ క్రీములను ఒంటికి రాసుకోవాలి.
- ముఖ్యంగా తెల్లవారుజాము మరియు సాయంత్రం వేళల్లో దోమలు యాక్టివ్ గా ఉంటాయి. వాటిని ఇంట్లోకి అనుమతించకుండా జాగ్రత్త పడాలి.
- నీరు నిల్వ ఉన్న చోట దోమలు పెరుగుతాయి, అలాంటి వాటిని గుర్తించి నీరు నిల్వలేకుండా చూసుకోవాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లోనే ఎక్కువగా డెంగీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆగష్టు నుంచి డిసెంబర్ మాసం వరకు దోమ కాటుకు గురవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూను నివారించవచ్చు.