Gold Price Rally: 2027 నాటికి బంగారం ధర రూ. 3 లక్షలకు పైమాటే.. సోషల్ మీడియాలో బాబా వంగా భవిష్యవాణి వార్తలు వైరల్.. అసలు నిజమేమిటంటే..
భారతదేశంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలకు చేరుకుంటుండటంతో పసిడి ప్రియులలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1.50 లక్షల మార్కును దాటిన నేపథ్యంలో.. 2027 నాటికి పసిడి ధరలు మరింత విపరీతంగా పెరుగుతాయంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది
Gold Price Rally: భారతదేశంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలకు చేరుకుంటుండటంతో పసిడి ప్రియులలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1.50 లక్షల మార్కును దాటిన నేపథ్యంలో.. 2027 నాటికి పసిడి ధరలు మరింత విపరీతంగా పెరుగుతాయంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది.
బల్గేరియాకు చెందిన ప్రముఖ భవిష్యవేత్త బాబా వంగా ఈ విషయాన్ని అప్పుడే జోస్యం చెప్పారంటూ కొందరు జోడించడంతో ఈ ప్రచారానికి మరింత ప్రచారం లభించింది. అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ ప్రచారానికి, అసలైన ఆర్థిక విశ్లేషణలకు మధ్య చాలా తేడా ఉందని గ్రహించాల్సిన అవసరం ఉంది. డాలర్ దెబ్బకు రూపాయి మళ్లీ 99కు పతనం.. సంచలన అంచనాను విడుదల చేసిన కోటక్ సెక్యూరిటీస్.. కారణమేమిటంటే..
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, నగదు కొరత లేదా బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం తగ్గే పరిస్థితులు తలెత్తితే పెట్టుబడిదారులు సురక్షితమైన మార్గంగా భావించి బంగారం వైపు మొగ్గుచూపుతారు. ఈ పరిణామాల వల్ల పసిడి ధరలు మరో 25 శాతం నుండి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 3 లక్షల స్థాయికి చేరవచ్చని అంచనా వేస్తున్నారు. నిజానికి 2027లో బంగారం ధరలు ఈ స్థాయిలో పెరుగుతాయని బాబా వంగా చెప్పినట్లు ఎలాంటి చారిత్రక ఆధారాలు గానీ, నమోదైన రికార్డులు గానీ లేవు. కేవలం ఆసక్తిని పెంచడానికే ఆమె పేరును ఈ ప్రచారానికి ముడిపెడుతున్నారు.
బాబా వంగా పేరుతో జరుగుతున్న ఊహాగానాలను పక్కన పెడితే, ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు వెల్లడించిన వాస్తవ గణాంకాలు వేరేలా ఉన్నాయి. ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థ జేపీ మోర్గాన్ అంచనాల ప్రకారం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు , నిలకడ లేని ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2026 చివరి నాటికి 6,000 డాలర్లకు, 2027 నాటికి 6,300 డాలర్లకు చేరే అవకాశం ఉంది. అదేవిధంగా మరొక ప్రముఖ సంస్థ యూబీఎస్ విశ్లేషణ ప్రకారం 2027 తొలి అర్ధభాగంలో ఔన్సు బంగారం ధర 5,000 డాలర్ల స్థాయిని తాకే వీలుంది. ఈ గణాంకాలు ధరల పెరుగుదలను సూచిస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో జరుగుతున్నంత తీవ్రమైన ప్రచారం కాదని స్పష్టమవుతోంది.
బంగారం ధరలనేవి కేవలం ఊహాగానాలపై కాకుండా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, అమెరికన్ డాలర్ విలువ , భౌగోళిక రాజకీయ పరిణామాలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి లేదా సంక్షోభాలు ఎదురైనప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక సురక్షిత ఆస్తిగా భావించి కొనుగోళ్లు పెంచుతారు. దీనికితోడు ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు జరిపే కొనుగోళ్లు కూడా పసిడి ధరల హెచ్చుతగ్గులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి కాలక్రమేణా మారే అంతర్జాతీయ పరిణామాలను బట్టి ఈ ఆర్థిక అంచనాలు కూడా మారే అవకాశం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.