Bhogapuram Airport: వీడియో ఇదిగో.. భోగాపురం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తొలి కమర్షియల్ విమానం.. తొలి రోజు నడవనున్న 31 సర్వీసులు..

ఉత్తరాంధ్ర విమానయాన చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో కొత్తగా నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' నుంచి వాణిజ్య విమాన సర్వీసులు సోమవారం అధికారికంగా ప్రారంభమయ్యాయి.

Bhogapuram Airport Welcomes First Commercial Flight

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర విమానయాన చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో కొత్తగా నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' నుంచి వాణిజ్య విమాన సర్వీసులు సోమవారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో (6E6408) విమానం ఉదయం 6:45 గంటలకు భోగాపురం రన్‌వేపై విజయవంతంగా ల్యాండ్ అవ్వడంతో ఇక్కడ కార్యకలాపాలు లాంఛనంగా మొదలయ్యాయి.

నూతన విమానాశ్రయానికి చేరుకున్న తొలి విమానానికి, ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్ నిర్వాహక సంస్థ జీఎంఆర్ (GMR), పౌర విమానయాన శాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. తొలి ప్రయాణ జ్ఞాపకార్థం ప్రయాణికులకు ప్రత్యేక ధ్రువీకరణ పత్రాలతో పాటు స్థానిక సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికలుగా అందజేశారు. దీని తర్వాత కొద్దిసేపటికే బెంగళూరు నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కూడా ఇక్కడ సురక్షితంగా ల్యాండ్ అయింది.

ఆగస్టు 17 నుండి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు వైఎస్సార్‌సీపీ డిమాండ్!

భోగాపురం విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో, విశాఖపట్నంలోని పాత ఎయిర్‌పోర్ట్ నుంచి నడిచే పౌర విమాన సర్వీసులన్నింటినీ ఇక్కడికే మార్చారు. విశాఖ నుంచి ఆదివారం రాత్రి 10:45 గంటలకు ఢిల్లీకి చివరి వాణిజ్య విమానం బయలుదేరడంతో అక్కడ పౌర సేవలు ముగిశాయి. ఇకపై భోగాపురం నుంచే సేవలు అందుబాటులో ఉంటాయి. తొలిరోజే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాలకు మొత్తం 31 సర్వీసులు నడవనుండగా, దాదాపు 7 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించనున్నారు.

Bhogapuram Airport Welcomes First Commercial Flight

ఈ అత్యాధునిక విమానాశ్రయం ప్రారంభం కావడం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాలు వేగంగా విస్తరించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని అంచనా వేస్తుండగా, రానున్న రోజుల్లో మరిన్ని దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు ఇక్కడి నుంచి ప్రారంభం కానున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement