Telangana Freebies Row: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన.. ఉచిత పథకాలతో తీవ్ర ప్రమాదకర పరిస్థితులు.. ఇలాగే కొనసాగితే దివాళా తీయడం తప్పదని కీలక వ్యాఖ్యలు..

తెలంగాణలో పరిమితి లేకుండా అమలు చేస్తున్న ఉచిత సంక్షేమ పథకాలు, వాటి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉచిత పథకాలు ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో.. త్వరలోనే తీవ్ర ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించింది.

Telangana High Court (X)

Telangana Freebies Row: రాష్ట్రంలో పరిమితికి మించి ఉచిత పథకాలు అమలు చేయడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆదాయం, వ్యయాల మధ్య సమతుల్యత లేకుండా సంక్షేమ పథకాలను కొనసాగిస్తే భవిష్యత్‌ తరాలకు తీవ్ర ఆర్థిక భారం తప్పదని వ్యాఖ్యానించింది. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.. ఇది దీర్ఘకాలం ఆచరణ సాధ్యం కాదు అంటూ జస్టిస్‌ నగేశ్‌ భీమపాక కీలక వ్యాఖ్యలు చేశారు.

కంటోన్మెంట్‌ బోర్డుకు రూ.33.42 కోట్లు విడుదల చేయాలంటూ 2024లో ఇచ్చిన కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై బోర్డు సభ్యుడు జె. రామకృష్ణ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. ఇప్పటికే రూ.24 కోట్లు చెల్లించామని.. మిగిలిన మొత్తాన్ని ఆరు నెలల్లో వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని కోర్టుకు తెలిపారు.

మీ జీవితం చాలా విలువైనది.. తొందరపడవద్దు.. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారికి సీపీ సజ్జనార్ కీలక సూచన.. సీఏ సూసైడ్ చాలా బాధాకరమని ఆవేదన..

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో జీతాలు, అప్పుల చెల్లింపులు వంటి ఖర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని సంక్షేమ పథకాలకే వెచ్చించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.మనకు వచ్చే ఆదాయమెంత? ఖర్చెంత? భవిష్యత్తులో పిల్లలకు ఏం మిగులుతుందని ప్రశ్నించారు. అర్హత లేని వారికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయా అనే అంశాన్ని ప్రస్తావిస్తూ.. కోటీశ్వరులకు రైతుబంధు, ఖరీదైన వాహనాల్లో తిరిగేవారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలు ఎందుకని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఉచిత పథకాల పరిధి విస్తరించడంపై న్యాయమూర్తి మరో కీలక ప్రశ్న వేశారు. ఒక్క తెల్లకార్డునైనా తొలగించగలరా? అలా చేస్తే అదో రాజకీయ అంశంగా మారుతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వ్యవహారాల్లో అధికారులపై భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. ఈ పరిస్థితుల్లో అధికారులు కూడా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు.

ప్రభుత్వ అప్పులు, ఆస్తుల విక్రయం వంటి అంశాలను ప్రస్తావిస్తూ భవిష్యత్‌ తరాలపై పడే భారాన్ని న్యాయమూర్తి ప్రశ్నించారు. అప్పులు తీర్చేందుకు ప్రభుత్వ భూములను విక్రయిస్తే, భవిష్యత్‌ తరాలకు ఏమి మిగులుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పు చేసి ఎవరైనా బెంజ్‌ కారు కొంటారా? ఎర్రబస్సులో వెళ్లే వాళ్లం.. ఎయిర్‌బస్‌లో వెళ్తామంటే ఆ కుటుంబం ఎంతకాలం నిలబడుతుంది అంటూ ప్రభుత్వ ఆర్థిక విధానాన్ని ఉదాహరణతో వివరించారు.

రాష్ట్రంలో సుమారు 1.15 కోట్ల కుటుంబాలు ఉండగా, దాదాపు 1.03 కోట్ల కుటుంబాలకు ఏదో ఒక రూపంలో ఉచిత పథకాలు అందుతున్నాయని పేర్కొంటూ.. ఇలాంటి విధానం దీర్ఘకాలంలో కొనసాగడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఉచిత పథకాలు ప్రజలకు తక్షణ ప్రయోజనం అందించినప్పటికీ.. వాటి ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే రాష్ట్రంలో త్వరలోనే ప్రమాదకర ఆర్థిక పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇది రాజకీయ ఉపన్యాసం కాదు.. ఆవేదనతో చెబుతున్నా. సమాజం ప్రమాదంలో పడబోతోంది. ఇవన్నీ ఎంతవరకు సాధ్యమో ప్రభుత్వాలే తెలుసుకోవాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కాగా, కంటోన్మెంట్‌ బోర్డుకు సంబంధించిన బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు, తదుపరి విచారణను ఆగస్టు 19కు వాయిదా వేసింది.

ఈ కేసులో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాకు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ అఫిడవిట్‌ దాఖలు చేయకపోవడం, కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంపై హైకోర్టు గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆయనపై బెయిలబుల్‌ వారంట్‌ కూడా జారీ చేసిన కోర్టు.. దాన్ని అమలు చేయాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించింది. రూ.5 వేల విలువైన వ్యక్తిగత బాండ్‌ సమర్పిస్తే బెయిల్‌ ఇవ్వాలని పేర్కొంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement